Cyber Crime | సిటీబ్యూరో, మే2(నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌కు చెందిన 59 ఏళ్ల ప్రైవేటు ఉద్యోగికి వాట్సాప్ గ్రూపులో రూ. 15 లక్షల రుణం ఇస్తానంటూ ప్రకటన వచ్చింది. ఇది చూసి అతడు ప్రకటనలో ఇచ్చిన నంబర్‌కు కాల్‌చేయగానే అవతలి వ్యక్తి రుణానికి సంబంధించి మాయమాటలు చెప్పి నమ్మించాడు. అఫ్లై చేయగానే సిబిల్ తక్కువగా ఉందంటూ బ్యాంక్రుణం ప్రాసెస్ చేయాలంటే సిబిల్‌తో పాటు కొన్ని చార్జీలు కట్టాలంటూ రూ.14.5లక్షలు వసూలు చేశాడు. ఈ సొమ్ము రుణం మంజూరు కాగానే రిఫండ్ చేస్తామని చెప్పాడు. చివరికి సైబర్ నేరగాడు స్పందించకపోవడంతో బాధితుడు సైబర్ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు.
– నగరానికి చెందిన 57 ఏళ్ల ఉపాధ్యాయురాలు ఆన్లైన్లో రుణం కోసం ఒక ఫైనాన్స్ ప్రకటన చూసి వారిని సంప్రదించింది.
సదరు ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి నంటూ ఒకరూ ఆమెను సంప్రదించి లోన్ప్రాసెసింగ్ ఫీజు, ఇతరత్రా చార్జీల పేరుతో పలు దఫాలుగా రూ.5.50 లక్షలు తాను సూచించిన ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చినా తనకు లోన్ మంజూరు చేయకపోగా ఇంకా డబ్బులు కావాలంటూ అడుగుతుండడంతో ఆమెకు అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలాంటి ఘటనలు నగరంలో తరుచుగా జరుగుతున్నాయి. సైబర్ పోలీసుల దృష్టికి కొన్నే ఫిర్యాదులు వస్తుండగా రెండు నుంచి మూడు లక్షలకు సంబంధించి మోసపోయినవి బాధితులు పోలీసుల వరకు తీసుకురావడం లేదని సైబర్ పోలీసులు తెలిపారు. క్లిక్ చేస్తే రుణం.. అంటూ మభ్యపెట్టి అఫ్లైలోన్ చార్జీల పేరుతో దోపిడీ చేస్తున్న ఘటనలు చాలా జరుగుతున్నాయి.
వడ్డీ తక్కువ.. డాక్యుమెంట్లు అవసరం లేదు.. నిమిషాల్లోనే రుణం మంజూరు.. ఆన్లైన్లో ఇలాంటి ప్రకటనలు డబ్బులు అవసరమున్నవారికి ఆశ పుట్టిస్తున్నాయి. రుణం ముసుగులో వ్యక్తిగత, ఆదాయ వివరాలు సేకరిస్తూ రుణం మంజూరైందని చెప్పి ఆ తర్వాత చార్జీల పేరు చెప్పి సొమ్ములు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ గత సంవత్సరం 75 ఆన్లైన్ లోన్లకు సంబంధించిన మోసాల కేసులు నమోదైతే ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే 28 కేసులు నమోదయ్యాయి.
వ్యక్తిగత రుణం అవసరమున్న కొందరు బ్యాంకులు, నాన్బ్యాంకింగ్ఫైనాన్షియల్ కంపెనీలను సంప్రదిస్తారు. వారు డాక్యుమెంట్లు, సిబిల్ ఇలా పలు కారణాలు చెప్పడంతో అప్పు పుట్టదనే ఆలోచనలో ఆన్లైన్లో వెతుకుతున్నారు. రుణం కోసం వెతికితే ఆన్లైన్లో కనిపించే ప్రకటనలకు ఆకర్షితులవుతున్నారు. గూగుల్‌లో లోన్ కోసం వెతికితే అందుకు సంబంధించిన ప్రకటనలు చాలా కనిపిస్తున్నాయి. ఈ ప్రకటనల వెనక ఎవరున్నారు.. అసలు కంపెనీలు నిజమైనవా కావా తేల్చుకోకుండానే లోన్కోసం అఫ్లై చేస్తున్నారు. సైబర్‌నేరగాళ్లు ఇచ్చే ఫేక్ ప్రకటనలలో నిజానిజాలు తెలుసుకోకుండానే చాలామంది లోన్ల కోసం అప్లికేషన్ నింపడం, అందులో ఉన్న కాంటాక్ట్ నంబర్లను సంప్రదించడంతో సైబర్ నేరగాళ్లు తమ పని మొదలుపెడ్తారు.
ముందు నమ్మించి ఆ తర్వాత సిబిల్ కరెక్ట్ లేదని, అది సరిచేయాలంటే కొంత చార్జీలు కట్టాలని షరతు పెడతారు. సిబిల్ స్కోర్ ఇంకా సెట్ చేయలేదని, రుణం ప్రాసెస్‌లో ఉందంటూ కొన్నిరోజుల మభ్యపెట్టి ఆ తర్వాత జీఎస్టీ చార్జీలు కట్టాలంటూ మరికొన్ని డబ్బులు లాగుతున్నారు. ఇలా పలురకాలుగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుని ఆ తర్వాత లోన్ త్వరలోనే వస్తుందంటూ చెప్పి స్పందించడం మానేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువగా ఆన్లైన్లోన్లకు సంబంధించినవే ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.