హయత్‌నగర్, మే 4: జీహెచ్ఎంసీ నుంచి ఇంటి నిర్మాణానికి అనుమతులన్నీ తీసుకున్నా..ఎల్బీనగర్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ చైన్‌మెన్ ఇష్టారాజ్యంతో ఓ నిరుపేద కుటుంబానికి చెందిన షెడ్డును నేలమట్టం చేశాడు. షెడ్డు కూల్చకూడదంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధింపులకు గురిచేశాడు. దీంతో తమకు అన్ని విధాలుగా న్యాయం చేయాలని బాధిత దంపతులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ‘ఎక్స్’ వేదికగా వేడుకోలు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం, రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో టి.ఉమామహేశ్వర్రావు(54), టి.శ్రీదేవి(50) దంపతులు ఇద్దరు కుమారులు బాలవర్దన్, గోపీచంద్‌తో కలిసి నివాసముంటున్నారు.
2025, జనవరి 2న బొట్ల శ్రీను వద్ద శ్రీదేవి, ఉమా మహేశ్వర్‌రావు దంపతులు హయత్‌నగర్‌లోని లక్ష్మీప్రియ కాలనీలో 220 గజాల ప్లాటును కొనుగోలు చేశారు. అప్పటికే అదే ప్లాటుకు యజమాని బొట్ల శ్రీను ఎల్ఆర్ఎస్ రూ. లక్షా 30 వేలు, రూ.73 వేలుచెల్లించి జీప్లస్ టూ నిర్మాణానికి (ప్రొసిడింగ్ నెం. 444916/జీహెచ్ ఎంసీ/17750/2024) అనుమతులు పొందారు. శ్రీదేవి, ఉమా మహేశ్వర్‌రావు దంపతులు 20 ఫీట్ల సెట్ బ్యాక్‌తో కొనుగోలు చేసిన ప్లాటులో రెండు నెలలుగా రేకుల షెడ్డును నిర్మించుకున్నారు. ఏప్రిల్ 23న రూ.24,541లు చెల్లించి అసెస్మెంట్ కూడా చేయించుకున్నారు.
స్థానికంగా ఉండే చైన్‌మెన్ సతీశ్‌కుమార్ వనస్థలిపురం వద్దకు ఉమామహేశ్వర్‌రావును పిలిపించుకుని ప్లాటుకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించాడు. అన్ని పేపర్లు సరిగ్గానే ఉన్నాయంటూ..‘షెడ్డుపై యూట్యూబ్ చానళ్లు, పేపర్ల వారి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి.. రూ.లక్ష ఇస్తే గానీ నీ షెడ్డును కూల్చివేయబోం’ అని నోటీసులు జారీ చేసి హెచ్చరించాడు. సదరు బాధిత కుటుంబ సభ్యులు హయత్‌నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ తిప్పర్తి యాదయ్యను కలిసినా.. ఫలితం లేకుండా పోయింది. ఏప్రిల్ 30న కారు నం. (టీఎస్ 12 ఈవీ 1116)లో వచ్చిన జీహెచ్ఎంసీ చైన్‌మెన్ సతీశ్‌కుమార్, మరో వ్యక్తితో వచ్చి జేసీబీ సహాయంతో రేకుల షెడ్డును కూల్చివేశారు.
బంగారు నగలు తాకట్టుపెట్టి తెచ్చిన డబ్బులతో రేకుల షెడ్డును నిర్మించుకుంటే జీహెచ్ఎంసీ చైన్‌మెన్ సతీశ్‌కుమార్ కక్ష సాధింపులతో కూల్చివేశారని బాధిత కుటుంబసభ్యులు వాపోయారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తమకు అన్యాయం జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్..ఆంధ్ర సెటిలర్లమైన తమకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి జీహెచ్ఎంసీ చైన్‌మెన్ సతీశ్‌కుమార్ నుంచి నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.