Raidurgam | కొండాపూర్, ఏప్రిల్ 24 : హైదరాబాద్‌లోని రాయదుర్గం (దర్గా) ప్రభుత్వ పాఠశాల హెడ్మాస్టర్ ఎస్కే తాజ్ బాబు తనను వేధిస్తున్నాడని వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్న లక్ష్మీ ఆరోపించింది. కులం పేరుతో దూషించడమే కాకుండా లైంగికంగానూ వేధింపులకు గురిచేస్తున్నాడని పేర్కొంది. ఈ మేరకు కేవీపీఎస్ శేరిలింగంపల్లి జోన్ కమిటీ ఆధ్వర్యంలో మాదాపూర్ డీసీపీ వినీత్‌ను బాధితురాలు కలిసి ఫిర్యాదు చేశారు. హెడ్ మాస్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కేవీపీఎస్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రకాశ్ కారత్ మాట్లాడుతూ.. ఇదే విషయమై హెడ్మాస్టర్పై గత నెల 28వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారని.. కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే హెడ్మాస్టర్ను అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై డీసీపీ వినీత్ తక్షణమే స్పందించారు. ఈ కేసు విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని ఏసీపీ శ్రీకాంత్‌ను ఆదేశించారు.