సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): నగర శివారు ప్రాంతాల్లో గండిపేట, కోకాపేట, పుప్పాల్‌గూడ చుట్టు పక్కల నివాసముండే ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అత్యాధునికంగా వర్టికల్ (నిలువు) వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు నీటి ఎద్దడి నుంచి ఊరట కలిగించేలా చర్యలు చేపట్టింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ రిజర్వాయర్ల నుంచి అదనంగా సరఫరా చేసే నీటిని శుద్ధి చేయడానికి గండిపేట కాండూట్ మీద ఈ వర్టికల్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు నిర్మిస్తారు. ఈ నేపథ్యంలో బుధవారం జలమండలి ఎండీ సుందర్శన్ రెడ్డితో పాటు జీఎం రవీందర్‌రెడ్డి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. మూడు ప్రాంతాల్లో 3 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన అత్యాధునిక వర్టికల్ వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్లను నిర్మించడానికి అనువైన స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎండీ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఓఆర్ఆర్ పరిధిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం వల్లే జలమండలి ట్యాంకర్లకు డిమాండు ఏర్పడిందన్నారు. గండిపేట, కోకాపేట, పుప్పాల్‌గూడ సమీప ప్రాంతాల్లో అదనంగా 9 ఎంఎల్డీల మంచి నీటి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లు రోజూ 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సరఫరాకు కొరత లేదని జలమండలి అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం నగరానికి నాగార్జున సాగర్, ఎల్లంపల్లి, మంజీరా, సింగూరు నుంచి నీరు సరఫరా జరుగుతున్నది. ఇవే కాకుండా జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నుంచి సైతం నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో నుంచి జీహెచ్ఎంసీ ప్రాంతానికి 1082.62 ఎంఎల్డీలు, జీహెచ్ఎంసీ అవతల ఉన్న ప్రాంతాలకు 1049.58 ఎంఎల్డీలు, ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలు, గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలకు 277.21 ఎంఎల్డీలు, మిషన్ భగీరథ కోసం 149.47 ఎంఎల్డీల నీటిని సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. నగరానికి సమీపంలో ఉన్న ఉస్మాన్‌సాగర్(గండిపేట), హిమాయత్‌సాగర్ జలాశయాల్లో సమృద్ధిగా నీటి లభ్యత ఉంది. ఈ రెండు జలాశయాల నుంచి ప్రస్తుతం 2409.53 ఎంఎల్డీల నీరు సరఫరా జరుగుతున్నది. గతేడాది ఇదే రోజు 2270 ఎంఎల్డీల నీరు సరఫరా చేశారు. దీని ప్రకారం ఈ ఏడాది అదనంగా 139.53 ఎంఎల్డీల నీటిని సరఫరా చేస్తున్నారు.