బంజారాహిల్స్, ఏప్రిల్ 2: అబద్ధాలే పునాదిగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తల మీద ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్ నియోజక వర్గం వెంకటేశ్వరకాలనీ డివిజన్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని బంజారాభవన్‌లో ఘనంగా నిర్వహించారు. ముందుగా సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి ఎమ్మెల్యే దానం నాగేందర్ పూల మాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి ఎంతగానో ఉందన్నారు. సంపదను పెంచడం, దాన్ని పేదలకు పంచడం సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకొని అనేక సంక్షేమ పథకాలను ప్రారంభించారన్నారు.
అనంతరం ఎమ్మెల్సీ వాణీదేవి, తెలంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ విప్లవ్ కుమార్ మాట్లాడుతూ..2014 కంటే ముందు తెలంగాణ ఎలా ఉండేది.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇప్పుడెలా అభివృద్ధి దిశలో ఉందో బేరీజు వేసుకొని ప్రతి ఒక్కరు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్న తీరును చూస్తుంటే.. మరోసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తుందన్నారు. ఒకప్పుడు ఉన్న కరెంటు కష్టాలు, నీటి తిప్పలు ఇప్పుడు లేవన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న రామ్మూర్తి, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, నియోజకవర్గం బీఆర్ఎస్ సీనియర్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, డివిజన్ అధ్యక్షుడు రాములు చౌహాన్, మహిళా విభాగం అధ్యక్షురాలు యెండూరి మాధవి, నాయకులు రాంచందర్, జావెద్, రాజేశ్వరి, ఆంటోనీ, వెంకటస్వామి, రాందాస్, సారంగపాణి, పీరన్, నల్లశివ తదితరులు పాల్గొన్నారు.
‘చిన్నచిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా మేమంతా ఒక్కటే… పార్టీ గెలుపుతోనే నాయకులకు మనుగడ… రానున్న ఎన్నికల్లో ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా మరోసారి ఎగురవేయడమే లక్ష్యం’ అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, నియోజకవర్గ సీనియర్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి ప్రకటించారు. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న వారిద్దరి ఆత్మీయ కలయికకు బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం వేదికైంది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మరోసారి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయడమే తమ లక్ష్యమని ఇరువురు నేతలు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మన్నె గోవర్ధన్‌రెడ్డికి రాజకీయంగా మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నానని ఎమ్మెల్యే ప్రకటించడాన్ని కార్యకర్తలు హర్షద్వానాలతో స్వాగతించారు. సీనియర్ ఉద్యమ కారులు నిస్సార్, సారంగపాణి, రాజేశ్వరితో పాటు ప్రారంభం నుంచి బీఆర్ఎస్లో ఉన్న పలువురు నాయకులు తమ అభిప్రాయ భేదాలను పక్కన పెట్టి ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొనడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అ నంతరం ఎమ్మెల్యే దానం, గోవర్ధన్‌రెడ్డితో పాటు ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులంతా సహపంక్తి భోజనం చేశారు.