బంజారాహిల్స్,ఏప్రిల్ 2: జనాభాలో 10శాతం ఉన్న లంబాడాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోతే రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తామని గిరిజన విద్యార్థి సంఘం జాతీయ కార్యనిర్వాహక ఆధ్యక్షుడు వెంకట్ బంజారా హెచ్చరించారు. మంత్రివర్గ విస్తరణలో భాగంగా లంబాడాకు ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గిరిజన విద్యార్థి సంఘం, లంబాడా హక్కుల పోరాటసమితి ఆధ్వర్యంలో బుధవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ముట్టడికి యత్నించారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 36నుంచి సీఎం నివాసం వైపుకు ప్లకార్టులతో వెళ్తున్న గిరిజన సంఘం నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో మొహరించిన పోలీసులు సంఘాల నేతలను అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా గిరిజన సంఘాల నేతలు వెంకట్ బంజారా,లోకేష్ నాయక్, సైదానాయక్, తదితరులు మాట్లాడుతూ.. లంబాడాల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మంత్రివర్గంలో లంబాడా నేతకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం రేవంత్‌రెడ్డిని రానున్న ఎన్నికల్లో కొడండల్లో ఓడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గిరిజన సంఘాల నాయకులు రమేష్ నాయక్, రోహిత్ పవార్, ఆరుణ్ శ్రీరాం, పరుశరామ్‌నాయక్, పున్ని బాయ్, అచ్చి బాయ్ తదితరులు పాల్గొన్నారు.