Hyderabad Traffic | సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా హెచ్ఎండీఏ చేసిన ట్రాఫిక్ అధ్యయనాలు మూలనపడుతున్నాయి. పెరుగుతున్న వాహనాలు, రోడ్ల విస్తరణ, అందుబాటులో ఉన్న ప్రజా రవాణా సౌకర్యాలు, ఆధునిక రవాణా అంశాలపై కాంప్రెన్సివ్ ట్రాన్స్‌పోర్టు రిపోర్టును రెండేండ్ల కిందటే సిద్ధం చేశారు. అర్బన్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ(ఉమ్టా) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సర్వే ఇప్పటికీ అమల్లోకి రాలేదు. కనీసం అధ్యయనంలో పేర్కొన్న సూచనలు, భవిష్యత్ ప్రణాళికలను కూడా పక్కనపెట్టేశారు.
శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరానికి ట్రాఫిక్ సమస్య అత్యంత ప్రమాదకారిగా మారింది. నగరవాసులు జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే ట్రాఫిక్ సమస్యలకు శాస్త్రీయంగా అధ్యయనం చేసిన హెచ్ఎండీఏ అందుకు తగినట్లు పలు పరిష్కార మార్గాలను అన్వేషించింది.
రెండేండ్ల కిందట చేసిన ఈ ట్రాఫిక్ సర్వే ఇప్పటికీ అమలు కాలేదు. శివారు ప్రాంతాలను దాటి విస్తరిస్తున్న మహానగరానికి రవాణా వ్యవస్థ ఎంతో కీలకం. అంచనాలకు మించి వేగంగా పెరుగుతున్న వాహనాలతో రవాణా రంగంపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆర్టీసీ, మెట్రో, ఎంఎంటీఎస్‌లు వంటి రవాణా సదుపాయాలతోనూ ప్రజల రవాణా సాఫీగా సాగడం లేదు.
నగరంలో దాదాపు కోటికి పైగా వాహనాలు నిత్యం తిరుగుతున్నాయనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇందులో ప్రజా రవాణా సంస్థలకు సంబంధించిన వాహనాల కంటే వ్యక్తిగత వాహనాలే ఎక్కువగా ఉన్నాయి. పెరిగిన జనాలకు అనుగుణంగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సౌకర్యాలు లేకపోవడంతో వ్యక్తిగత వాహనాల వినియోగానికే ప్రాధాన్యతనిస్తున్నారు.
దీంతో ఇటీవల కాలంలో అంచనాలకు మించి ట్రాఫిక్ ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో ప్రయాణ సమయం విపరీతంగా పెరగడంతో ప్రత్యామ్నాయ ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు అత్యంత కీలకంగా మారింది. దేశంలోని మిగిలిన మెట్రో సిటీలకు మాదిరి ట్రాఫిక్ తీవ్రత హైదరాబాద్‌లోనూ పెరుగుతుండటంతో… ఉమ్టా చేసిన ట్రాఫిక్ అధ్యయనాలను అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.