3 కిలోమీటర్లు.. 90నిమిషాలుఎటుచూసిన బారులు తీరిన వాహనాలు.. రోడ్లను ముంచెత్తిన వరదనీటి ప్రవాహం.. వరదలో ఎక్కడ కొట్టుకుపోతామోనన్న భయంతో వాహనదారులు మెట్రోలకింద ప్రాణాలరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గంటల తరబడి నిలుచున్న దృశ్యాలు. ఇదీ సోమవారం సాయంత్రం నగరంలోని పలుప్రాంతాల్లో వర్షం కారణంగా నగరవాసులకు ఎదురైన పరిస్థితి.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ): నగరంలో సోమవారం సాయంత్రం నాలుగుగంటల నుంచి కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ వర్షానికి కేవలం పావుగంటలోనే ఎక్కడచూసినా వరద ప్రవాహమే కనిపించింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట, ఖైరతాబాద్, ఎల్బీనగర్, వనస్థలిపురం, పెద్ద అంబర్‌పేట, బేగంపేట, సికింద్రాబాద్, ఫిల్మ్‌నగర్, మణికొండ, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, నానక్‌రామ్‌గూడ తదితర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులపై నీరు నిలిచింది.
పలుచోట్ల మ్యాన్‌హోల్స్ పొంగిపొర్లాయి. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురిసినట్లుగా అధికారులు తెలిపారు. ఖైరతాబాద్-రాజ్‌భవన్ రోడ్డులో మోకాలి లోతు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. వరద ప్రవాహంలో ప్రయాణించడానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం పడిన సమయానికి ఎక్కడా హైడ్రా సిబ్బంది కనిపించకపోగా.. అక్కడకక్కడా ట్రాఫిక్ కానిస్టేబుళ్లే నీటిని క్లియర్ చేసే ప్రయత్నాలు చేశారు. చాలాచోట్ల బైకులు కొట్టుకుపోయాయి. భోలక్పూర పద్మశాలికాలనీ, గాంధీనగర్, ఛత్రినాక, శివగంగానగర్ను వరద ముంచెత్తింది.
వాహనదారుల నరకయాతన..
కృష్ణానగర్‌లో వరదనీటిప్రవాహంలో రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న బైక్ కొట్టుకుపోయింది. బంజారాహిల్స్ హకీంపేట పరిధిలో వరదధాటికి గోడ కూలింది. హకీంపేటలో వరదధాటికి విద్యుత్ స్తంభం నేలకూలింది. వనస్థలిపురం పరిధిలో బైక్ కొట్టుకుపోయింది. బంజారాహిల్స్ రోడ్ 10లోని జెహ్రానగర్ కుంటలో వరదపోటెత్తడంతో పలువాహనాలు కొట్టుకుపోయాయి. హకీంపేటలో భారీ వరద రావడంతో వరదలో ద్విచక్రవాహనాలు, ఆటో కొట్టుకుపోయింది. అక్కడే వరదలో కొట్టుకుపోతున్న వ్యాన్‌ను డ్రైవర్ అతి కష్టంమీద బయటకు తీసుకొచ్చారు.
పత్తాలేని అధికారులు, సిబ్బంది..!
గతంలో వర్షం కురిసిన వెంటనే అక్కడకు డిజాస్టర్ మేనేజ్మెంట్తో సంబంధమున్న శాఖల అధికారులంతా తరలివచ్చేవారు. ఎక్కడెక్కడైతే వరదనీరు ముంచెత్తుతుందో అక్కడ సహాయకచర్యలు చేపట్టడంలో ముందుండే వారు. ఈసారి మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైడ్రా ఈ విభాగం చేతుల్లోకి తీసుకున్న తర్వాత కూల్చివేతల్లో చూపించే ఉత్సాహం నగరంలో వరదముప్పును తప్పించడంలో చూపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా సోమవారం కురిసిన వర్షానికి ఒక్క గంటలోనే పెద్ద ఎత్తున వరదనీరు వచ్చి చేరడంతో ఏం చేయాలో పాలుపోక ఇతర శాఖల సిబ్బంది తమకు చేతనైన రీతిలో ప్రయత్నాలు చేస్తుంటే హైడ్రాసిబ్బంది మాత్రం తాపీగా వచ్చి వెళ్తోందని స్థానికులు చెప్పారు. అసలు చాలాచోట్ల ఒక్క ట్రాఫిక్ వాళ్లు తప్ప ఎవరూ లేరంటూ వాహనదారులు చెప్పారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనగానే గతంలో జీహెచ్ఎంసీ గుర్తుకు వచ్చేది.. కాగా ఇప్పుడు మాత్రం ఎవరి నోట విన్నా హైడ్రా పేరే వినిపిస్తోంది.
అంతగా ప్రచారం జరిగినా ఇతర శాఖలతో సమన్వయం లేకపోవడంతో ఈ విషయంలో హైడ్రా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.హైడ్రా చేతుల్లోకి మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ వచ్చిన తర్వాత నిర్వహణలోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అనుభవం లేని వారికి మానిటరింగ్ చేయాలంటూ బాధ్యతలు అప్పగించడంతో వర్షం వచ్చినప్పుడు ఎలా మేనేజ్మెంట్ చేయాలనే విషయంలో వారు పూర్తిగా వైఫల్యం చెందుతున్నారంటూ చర్చ జరుగుతోంది.
బడంగ్‌పేట, సెప్టెంబర్22: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముంపు సమస్యకు ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే కారణం మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి ఆరోపించారు. బడంగ్‌పేట ముంపు ప్రాంతాలలో సోమవారం ఆమె పర్యటించి స్థానికులతో మాట్లాడారు. కార్పొరేషన్ పరిధిలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే ఎస్ఎన్డీపీ నాలా ఏర్పాటుకు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 100 రోజుల ప్రణాళికలో మున్సిపల్ అధికారులు నాలాలను క్లీన్ చేయలేక పోయారని సబితారెడ్డి మండిపడ్డారు. ఆమె వెంటబడంగ్పేట బీఆర్ఎస్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.
హయత్‌నగర్, సెప్టెంబర్ 22 : ప్రభుత్వం ముంపు బాధితులకు తక్షణ సాయం, భోజన వసతిని కల్పించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం హయత్‌నగర్ డివిజన్లో ముంపునకు గురైన బంజారాకాలనీలో.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పర్యటించారు.ఆయన మాట్లాడుతూ.. ఇంజాపూర్ నుంచి వచ్చే వరదనీటి ప్రవాహం వల్లే బంజారాబస్తీ మునిగిపోయిందన్నారు. నూతన ట్రంక్‌లైన్ త్వరలోనే ప్రారభిస్తామన్నారు. ముంపు బాధితులకు తనవంతు సహాయం అందిస్తానని, ఎవరూ అధైర్యపడవద్దని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, గంగని నాగేష్ తదితరులు పాల్గొన్నారు.