Hyderabad | మైలార్‌దేవ్‌పల్లి, జూన్ 4 : ఆర్టీసీ బస్టాప్‌లలో అక్రమంగా, అడ్డదిడ్డంగా పార్కింగ్లు చేస్తుండడంతో ప్రయాణికులు ప్రమాదభరితంగా రోడ్లపై బస్సుల కోసం వేచి ఉండాల్సి వస్తుంది. అసలే చాలా ప్రాంతాల్లో బస్టాప్‌లలో బస్షెల్టర్లు లేక ప్రజలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నానా ఇబ్బందులు పడుతుంటే బస్షెల్టర్లు ఉన్న ప్రాంతాలలో వాహనదారులు అక్రమంగా పార్కింగ్లు చేస్తుండడంతో గత్యంతరం లేక రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
అత్తాపూర్ డివిజన్ హైదర్‌గూడ పిల్లర్ నెంబర్ 140 వద్ద ఉన్న బస్షెల్టర్ల ముందు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు ఇలా పార్కింగ్లు చేస్తుండడంతో బస్షెల్టర్లల్లో ఉన్న వారు బస్సులు ఎక్కేందుకు వెళ్లే సమయానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్లు వాటిని ముందుకు పోనిస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్లు సైతం బస్సులను కొద్ది సేపే ఆపుతుండడంతో గత్యంతరం లేక ప్రయాణికులు రోడ్లపై వేచి ఉండి బస్సులు వచ్చిన సమయంలో ఎక్కి తమ గమ్యస్థానాలకు వెళ్తున్నారు. ఈ చౌరస్తా ఎప్పుడు రద్దీగా ఉండడంతో పాటు వ్యాపార సముదాయాలు అనేకం ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లోకి వచ్చే వాహనాదారులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్కడే పార్కింగ్లు చేసుకుంటూ వెళ్తున్నారు.
అలాగే ఆర్టీసీ బస్‌షెల్టర్ ముందు సైతం పార్కింగ్లు చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఎప్పుడు చూసిన బస్టాప్‌లో ఆటోలు, కార్లు, ద్విచక్ర వాహనాలు పార్క్ చేసే ఉంటాయి. వీటిని పక్కకు పెట్టుకోవాలని ప్రయాణికులు కోరిన వారి మాటలు లెక్క చేయకుండా పార్క్ చేసి వెళ్లిపోతున్నారు. గతంలో బస్షెల్టర్లు లేకపోవడంతో అధికారులకు అనేకమార్లు వినతిపత్రాలు అందించి అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి బస్‌షెల్టర్ ఏర్పాటు చేసుకుంటే ఇది కాస్తా అక్రమ పార్కింగ్‌లకు అడ్డాగా మారిపోయిందని ప్రయాణికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చోరవ తీసుకోని అక్రమంగా పార్కింగ్లు చేస్తున్న వాటిని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు.