Begumpet | బేగంపేట్, మార్చి 18 : ఆధునిక యుగంలో ఉరుకుల పరుగుల జీవితంలో నిండు నూరేళ్లు జీవించడమనేది కలగా మారిపోయిన రోజులివి.. 60 సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించడానికి నేటితరం కష్టపడుతుంటే ఈ తాతయ్య మాత్రం అలవకగా సెంచరీ పూర్తి చేసుకున్నారు. యాంత్రికమైన ప్రస్తుత జీవన విధానంలో రెండు తరాల వారిని చూడటమే గగనంలా మారిన తరుణంలో నాలుగో తరానికి చెందిన తన ముని మనవడిని సైతం ఆడిస్తూ ఆరోగ్యంగా ఉన్న వీశంశెట్టి యాదగిరి తన వంశవృక్షంతో పాటు బంధుబలగంతో శతజయంతి వేడుకలను వారి సమక్షంలో కన్నుల పండుగగా జరుపుకున్నారు.
1925లో జన్మించిన యాదగిరి 2024 లో జన్మించిన తన ముని మనువడికి మధ్యలో ఉన్న తన వంశ వృక్షంతో ఒకే ఫ్రేమ్ లో దిగిన చిత్రం అందరిని కట్టిపడేసింది. ఆరు పదుల వయసులోనే వ్యాధుల బారిన పడుతున్న నేటి తరానికి వ్యసనాలు లేని జీవన విధానమే తన ఆరోగ్యానికి రహస్యంగా ఆయన చెప్పుకొచ్చారు.
సికింద్రాబాద్లోని ఓ హోటల్లో వీశంశెట్టి యాదగిరి తనయుడు ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన శతజయంతి వేడుకలు వివాహ వేడుకను తలపించాయి. మొదటగా 1925లో జన్మించిన యాదగిరితో పాటు అతని ఐదుగురు సోదరులు, వారి కుమారులు కుమార్తెలు, అల్లుళ్లు, కోడళ్ళు, మనమల్లు, మునిమనువడితో వారి జన్మించిన సంవత్సరాన్ని కాగితంపై లెక్కించి ప్రదర్శించిన తీరు అందరిని విశేషంగా ఆకట్టుకుంది.
అనంతరం వీశంశెట్టి యాదగిరి మాట్లాడుతూ తన శత జయంతి ఉత్సవాలను తన కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. నూరేళ్లు పూర్తి చేసుకున్న తన జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలలో దుకాణాలు వ్యాపారాలు నిర్వహిస్తూ అంచలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగినట్లు తెలిపారు. శత జయంతిని పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తన స్నేహితులు బంధువులు ఆత్మీయులు రావడం తనకు ఎంతో సంతృప్తి కలిగించిందని వెల్లడించారు.