Vangapalli Srinivas | రవీంద్రభారతి,ఫిబ్రవరి14 : ఎస్సీ వర్గీకరణ ఆమోదం ద్వారా మాదిగ అమరవీరుల ఆత్మలు శాంతించాయని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. మాదిగ అమరవీరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోని ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇండ్లతో పాటు రూ.50 లక్షలు ప్రకటించి అండగా నిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ ఆమోదం తెలిపిన తర్వాత కూడా మాదిగ అమరవీరుల కుటుంబాలను మందకృష్ణ మాదిగ పరామర్శించినందుకు ఆయనకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ అమరవీరుల కుటుంబ సభ్యులను వంగపల్లి శ్రీనివాస్ శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరుల త్యాగ ఫలితమే ఎస్సీ వర్గీకరణ అమోదం అని అన్నారు. అమరవీరుల కుటుంబసభ్యులను ఆదుకున్నప్పుడే ఆ ఫలితాలకు ఆ త్యాగాలకు గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు.
తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా నిలిచిన దండోరా ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులపై ఉన్న పోలీసు కేసులు తక్షణమే కొట్టివేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వంగపల్లి డిమాండ్ చేశారు. మాదిగ అమరవీరుల స్మారక స్థూపం ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నడిబొడ్డున ఎకరం స్థలం కేటాయించి స్మారక మ్యూజియం నెలకొల్పి మార్చి 1వ తేదీన అమరవీరుల స్మారక దినోత్సవంగా అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించి మాదిగ అమరుల సంస్మరణ సభను నిర్వహిస్తామన్నారు. మందకృష్ణ మాదిగ ఇప్పటికైనా అమరవీరుల కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం తరఫున వారికి ఆర్థిక సాయం వచ్చే విధంగా ఉద్యమం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అమరవీరుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. మా బిడ్డలకు నెరవేరింది కానీ రాష్ట్ర ప్రభుత్వం మా కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమరుల త్యాగ ఫలితమేనని అన్నారు. అందుకుగాను అమరుల కుటుంబాలకు ఇంటికో ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి 50 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.