జూబ్లీహిల్స్, నవంబర్7: కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమాన్ని రెండేండ్లపాటు పక్కనపెట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టడం కేవలం ఓట్లు దండుకోవడానికేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. శుక్రవారం యూసుఫ్‌గూడ లక్ష్మీనర్సింహనగర్లోని మహ్మదీయ మసీదు వద్ద ప్రార్థనల అనంతరం ఎన్నిక ప్రచారంలో భాగంగా ముస్లింలను కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
బీఆర్ఎస్ హయాంలో ముస్లిం మైనారిటీల కోసం ప్రవేశపెటిన సంక్షేమ పథకాల వివరాలను కరపత్రాల ద్వారా పంపిణీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కారు గుర్తుకే ఓటువేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం ప్రముఖులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
అజార్‌కు మంత్రి పదవి ఇవ్వడం ఓ ఎలక్షన్ స్టంట్ అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన షాదీముబారక్ పథకంతో ఎందరో నిరుపేద యువతుల పెళ్లిళ్లకు ఆర్థికసాయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఫయీమ్, ఖైసర్, ఆజమ్, సమీ, ఇబ్రహీం, సలీమ్, అస్లాం, ఫైజల్, సాదిక్, నర్సింగ్‌దాస్, సత్యనారాయణ, చిన్నాయాదవ్ తదితరులు పాల్గొన్నారు.