గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా దవాఖాన నిర్మాణం అక్కడి స్థానికులకు జీవన్మరణ సమస్యగా మారింది. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమయ్యే రహదారుల కోసం జీహెచ్ఎంసీ అధికారులు సర్వేలు చేస్తూ ఇండ్లు కోల్పోవల్సి వస్తున్న వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో స్టేడియం చుట్టుపక్కల కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘తాత ముత్తాతల నుంచి ఇక్కడే నివసిస్తున్నాం. అభివృద్ధి అని చెప్పి రేవంత్ రెడ్డి మా ఇండ్లను కూలుస్తామని చెబుతున్నాడు. మా నివాసాలు కేవలం వారికి ఓ చిన్న ఇండ్లగానేకనిపించొచ్చు. కానీ అవి మా జీవితం. మా భవిష్యత్తు.’ అని బస్తీవాసులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రతి రోజు ఇల్లు పోతుందనే బెంగతో కంటి మీద కునుకు ఉండటం లేదని వాపోయారు. ప్రభుత్వం తమ ఇండ్లను తొలగించకుండా అనేక మార్గాల్లో రోడ్లు నిర్మించొచ్చని కాలనీ వాసులు చెబుతున్నారు. ఖాళీ స్థలం సరిపడా ఉన్నా తమ ఇండ్ల మీదకు ఎందుకొస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తమ ఇండ్ల జోలికి వస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఆదివారం అన్ని పార్టీలతో సమావేశమై.. వంటా వార్పుతో నిరసన వ్యక్తం చేస్తామని బాలయ్య బడా, చందన్వాడి, హిందీనగర్, జాంబాగ్, జ్ఞాన్బాగ్ కాలనీ నివాసితులు గొంతెత్తారు.
సిటీబ్యూరో/అబిడ్స్, మార్చి 26 ( నమస్తే తెలంగాణ ): గోషామహల్ వద్ద కాంగ్రెస్ సర్కార్ మొండిపట్టుదలతో నిర్మిస్తున్న ఉస్మానియా ఆస్పత్రి కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ఇండ్లను లాక్కోవద్దని చెబుతున్నప్పటికీ వారి మాటలను ప్రభుత్వం పెడచెవిన పెడుతోంది. దవాఖానా నిర్మాణం జరిగే ప్రాంతంలో ఉన్న గోషామహల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, రెండు పెట్రోల్ బంకులు, ఇతర కార్యాలయాలను ఖాళీ చేయించి చుట్టూ బ్లూ షెడ్లను నిర్మించి ప్రత్యేకంగా సెక్యూరిటీని ఏర్పాటు చేసి మరీ పనులను చేపడుతున్నారు. మైదానానికి ఆనుకుని ఉన్న గోషామహల్ పోలీస్ క్వార్టర్స్, మైదానంలో ఉన్న పలు భవనాలను కూల్చివేసి పనులను నిర్వహిస్తున్నారు. భారీ వాహనాలను వినియోగించడం, జేసీబీలు తదితర యంత్రాల శబ్దాలతో పాటు నిర్మాణ పనులలో ఆటంకం రాకుండా అవసరమైనప్పుడు బర్మాలను పేల్చుతున్నట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో శబ్దాలు రావడంతో పాటు వైబ్రేషన్ జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు తమ ప్రాంతంలో ఉస్మానియా దవాఖానా నిర్మించవద్దని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం అవేమి పట్టించుకోకుండా పనులు మరింత స్పీడుగా జరిగేలా చర్యలు తీసుకుంటోందని వారు వాపోతున్నారు.
ఉస్మానియా దవాఖానా నిర్మాణం నేపథ్యంలో గోషామహల్ మీదుగా ప్రవహిస్తున్న నాలా ప్రస్తుతం ఆరు మీటర్లు ఉండగా దానిని మరో ఆరు మీటర్లు వెడల్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదే విధంగా బాలయ్య బాడ రహదారిని 100 ఫీట్లు, దారుస్సలాం జంక్షన్ నుంచి మాలకుంట వరకు 100 ఫీట్ల రహదారి, మొజాంజాహి మార్కెట్ నుంచి భూలక్ష్మి దేవాలయం చౌరస్తా వరకు 100 ఫీట్ల రహదారిని నిర్మించాలని జీహెచ్ఎంసీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఆయా నిర్మాణాలలో నివాసాలు, స్థలాలు కోల్పోతున్న వారితో సమావేశమై స్థలాలు పోతున్న బాధితులకు టీడీఆర్లను చెల్లిస్తామని చెప్పగా బాధితులు తమకు టీడీఆర్లు అక్కర్లేదని చెక్కులు మాత్రమే ఇవ్వాలని ఖరాఖండిగా అధికారులకు తేల్చి చెప్పారు. అంతే కాకుండా ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్కు అనుగుణంగా ధర నిర్ణయించి చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొదటి దశలో ఈ పనులను చేపట్టి తర్వాత ఘోడేకీ ఖబర్, చాక్నావాడి, గోషామహల్ తదితర ప్రాంతాలలో కూడా పనులు చేపట్టే ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్ల వెడల్పు కోసం అవసరమైతే మరిన్ని ఇళ్లను నేలమట్టం చేయనున్నారు.

ఇప్పటికే ఉన్న ఆసుపత్రికి మూసీ వైపున అనేక బ్లాక్లను నిర్మించడానికి సరిపడా విశాలమైన స్థలం ఉంది. ఉస్మానియా ఆసుపత్రి వెనుక ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అగ్నిమాపక కేంద్రం నుంచి భూలక్ష్మి మాతా ఆలయం వరకు సుమారు 25 ఎకరాల ప్రభుత్వ భూమి ఖాళీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని అక్కడే నిర్మిస్తే సరిపోతుంది కదా? అలా కాదని మా కాలనీల జోలికి రాకుండా నిర్మించొచ్చు. మా ఇండ్లను కూల్చేసే ప్రయత్నాన్ని మానుకోవాలి.
కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరు. ఇండ్లు కూలుస్తామంటూ నోటీసులతో బతకనివ్వడం లేదు. స్టేడియానికి ఆగ్నేయ దిశలో ఉన్న బాలయ్య బాడ ప్రాంతంలో చిన్న, మధ్య తరహా వ్యాపారాలతో కూడిన సుమారు 26 ఇళ్లు ఉన్నాయి. ఆసుపత్రి తూర్పు ప్రవేశ ద్వారం వైపు వెళ్లే రహదారి నిర్మాణం కోసం నాలా నుంచి 80 అడుగుల స్థలాన్ని సేకరిస్తున్నారు. సర్కార్ మా జోలికి రావొద్దు.
మూడు తరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. పాత ఇంటిని కూల్చేసి కొత్తగా ఇల్లు కట్టి రెండేళ్లు అయ్యింది. ఇల్లే జీవితం..అదే మా భవిష్యత్తు అనుకొని బతుకుతున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆసుపత్రి నిర్మాణం అంటూ మా జీవితాలపై పిడుగు వేయాలని చూడటం బాధాకరం. మా జోలికి రాకుండా ఆసుపత్రి కట్టుకోండి.
అసలు మనం ఇండియాలోనే ఉన్నామా అనే అనుమానం వస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితులు ఉన్నాయి. ఇన్నేండ్లు బతుకుతున్న మమ్మల్ని ప్రభుత్వం ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నది. మా ఇండ్లు తొలిగిస్తేనే రహదారి నిర్మాణం సాధ్యమంటూ చెప్పడం అవాస్తవం. మా ఇండ్ల జోలికి రాకుండా కూడా దారులు నిర్మించుకోవచ్చు.
నాకు నోటీసు ఇచ్చారు. 30-40 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాం. మా పిల్లలు ఇక్కడే పెరిగారు. ఒక్కసారిగా ఇళ్లు వదిలి వెళ్లమంటే ఎక్కడికి వెళ్తాం? ప్రజా సముదాయాల మధ్య ఆసుపతి నిర్మాణం పేరుతో మా ఇండ్లను కూల్చడం న్యాయం కాదు. ఇప్పుడు స్టేడియం మధ్యలో ఆసుపత్రి నిర్మాణం అంటే పరిసరాలు అధ్వానంగా ఉంటాయి.
ఇల్లు ఖాళీ చేయకపోతే మీరే నష్టపోతారంటూ అధికారులు బెదిరిస్తున్నారు. ఇల్లు ఖాళీ చేయకపోతే కోర్టులో వేస్తాం. మీరే నష్టపోతారంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఏడాది నుంచి పరేషాన్ చేస్తున్నారు. పిలల్ల చదువు, ఉద్యోగాలు ఎలా? మొత్తం 12వేల ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ప్రమాదంలో ఉన్నట్టే. ప్రభుత్వం పేదల ఇండ్ల జోలికిరాకుండా ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టాలి.
ప్రజాపాలన అని రేవంత్ చెప్పడమే కానీ అంతా ప్రజానాశనమే చేస్తున్నాడు. మా ఇల్లు కూల్చాల్సిన అవసరం లేకుండానే ఆసుపత్రి నిర్మాణం చేసుకోవచ్చు. ఖాళీ స్థలం వారికి అందుబాటులో ఉంది. కానీ ఏండ్లుగా నివాసం ఉంటున్న తమను ఇక్కడి నుంచి ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ సర్కార్ విధానాలు సరిగా లేవు.
మా ఇల్లు ప్రభుత్వానికి చిన్నదే కావొచ్చు.. కానీ అదే మా జీవితం. మా ఇల్లును తొలిగించాలంటే మా జీవితాన్ని నాశనం చేస్తున్నట్టే. జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అప్పుచేసి ఇల్లు కట్టుకున్నాం. ప్రభుత్వం ఇల్లు ఖాళీ చేయాలని చెబుతుంది. ఎక్కడికి వెళ్లాలి. ఎలా బతకాలి? ఇండ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నారు.