– ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి
నీలగిరి, జూలై 21 : అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ట్రైనీ కలెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఆర్జాలబావి-2 అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందుతున్న మెనును పరిశీలించారు. బాలింతలు, గర్భినీలతో మాట్లాడి పౌష్టికాహారం అందజేతపై వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో ఫ్రీ స్కూల్ చేయించి వారితో కొద్దిసేపు మాటామంతి నిర్వహించారు. చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేసి వారి పెరుగుదలలో లోపాలు ఉన్నా వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతల్లో రక్తహీనతను తగ్గించేందుకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకునేలా ప్రోత్సహించాలన్నారు. చాలామంది మహిళలు రక్త హీనతతో బాదపడుతున్నారని, దీనివల్ల చిన్నారులు బలహీనంగా అనారోగ్యంతో జన్మించి చనిపోతున్నారని తెలిపారు.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతలు, చిన్నారులు, గర్భినీలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నందున సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. మహిళల్లో రక్తహీనత కారణంగా చిన్నారులు పౌష్టికాహారం లోపాన్ని అదిగమించేందుకు గర్భినీలు, బాలింతలు ఏ సమయంలో ఏలాంటి ఆహారం తీసుకోవాలి, ఏరకమైన భోజనం తీసుకోవాలనే అంశాలపై వారికి సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. పోషకాహారంతో పరిపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందన్నారు. గర్భిణీలు పౌష్టికాహారం తీసుకుంటే శిశువులు ఆరోగ్యంగా జన్మిస్తారని తెలిపారు. చాలా మంది పౌష్టికాహారం లోపంతో అనారోగ్యం బారిన పడుతున్నందున అంగన్వాడీ కేంద్రాలలో అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట సీడీపీఓ చంద్రకళ, సూపర్వైజర్ మర్రి జయమ్మ, అంగన్వాడీ టీచర్ ఖుర్షీదాబేగం ఉన్నారు.

‘చిన్నారుల ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ చుపాలి’