CJP protest : కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటన హింసాత్మకంగా మారింది. ఇటు యువత, విద్యార్థులు పలువురు తీవ్రంగా గాయపడగా.. భద్రతాదళ సిబ్బంది కూడా గాయాలపాలయ్యారు. ఒకపక్క పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఇంత జరుగుతుంటే.. మరోపక్క సీజేపీకి చెందిన ఒక అధికార ప్రతినిధి చేసిన పని సంచలనంగా మారింది.
విజేత దహియా అనే యువకుడు, ఫిలిం మేకర్ సీజేపీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. అతడు కూడా సోమవారం నాటి నిరసనలో పాల్గొన్నాడు. అయితే, ర్యాలీ హింసాత్మకంగా మారుతున్న సమయంలో అతడు చాలాసేపు కనిపించకుండా పోయాడు. నేతలు, విద్యార్థులు, యువత లాఠీ దెబ్బలు తింటూ ఉంటే.. అతడు మాత్రం దగ్గర్లో ఉన్న ఒక ఫుడ్ ఔట్‌లెట్‌కు వెళ్లి బర్గర్ తిన్నాడు. నిరసన కార్యక్రమాన్ని వదిలివేసి మరీ బర్గర్ తిన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతడు బర్గర్ తింటూ కనిపంచాడు. దీంతో విజేత దహియా తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంత బాధ్యతాయుతమైన ఉద్యమం జరుగుతుంటే ఇలా మధ్యలో వదిలేసి ఫుడ్ కోసం వెళ్లేంత నిర్లక్ష్యం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
We strongly condemn the deeply insensitive actions of our spokesperson Vijeta Dahiya, whose videos surfaced while peaceful protestors and our team were facing brutal police violence. Such conduct is unacceptable, shows a complete lack of judgment, and is wholly inconsistent with…
— Cockroach is Back (@Cockroachisback) July 21, 2026
దీనిపై విజేత దహియా స్పందించాడు. తనకు బాగా ఆకలేయడం వల్లే వెళ్లి ఫుడ్ తిన్నానని పేర్కొన్నాడు. ఒక వ్యక్తి ఆహారం తీసుకోవడమే పెద్ద తప్పా అంటూ ప్రశ్నించాడు. పైగా ర్యాలీ ముగిసిందని భావించడం వల్లే తాను అక్కడినుంచి వెళ్లిపోయానని చెప్పాడు. అయితే, అతడి ప్రవర్తన తీరుపై సీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బాధ్యతారాహిత్యంగా ఉన్నందుకుగాను అతడిని సీజేపీ అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింది. పార్టీకి సంబంధించి అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేసింది.