సిటీబ్యూరో, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ) : తప్పుడు సమాచారంతో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సస్ అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కోవడంలో భాగంగా ఉర్దూ టీవీ జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, యూఎస్ కాన్సులేట్ జనరల్ హైదరాబాద్‌తో కలిసి ఎనిమిది నెలల పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో 37 మంది ఉర్దూ పాత్రికేయులు శిక్షణ పూర్తి చేశారు. ఈ సందర్భంగా సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సాలార్జంగ్ మ్యూజియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీజీపీ అంజనీ కుమార్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతోపాటు సీనియర్ జర్నలిస్టులు హాజరయ్యారు.
మెసేజ్ ఫార్వర్డింగ్ చేసే ధోరణి మంచిది కాదని జర్నలిస్టులకు డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారానికి ఉన్న ప్రామాణికత తెలియనంత వరకు ఇతరులకు షేర్ చేయకూడదని అభ్యర్థించారు. తప్పు సమాచారం వ్యాప్తి చేయడం వల్ల సమాజంలో ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో శాంతిభద్రతలకు భంగం కలిగి, హింసాత్మక ఘటనలు చెలరేగే అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ పొందిన వారిలో 30 శాతానికి పైగా మహిళా జర్నలిస్టులే ఉన్నారని ఓయూ విభాగాధిపతి స్టీవెన్ సన్ కోహిర్ తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టులు ఎంఏ మాజీద్, సయ్యద్ గౌస్, కోశాధికారి మొహ్సీన్, డా. మొహద్ ఆసిఫ్, అలీ, అక్బర్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.