సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : విశ్వనగరంగా గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ పోనీయొద్దని అధికారులకు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియాతోపాటు పలు విభాగాలతో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజధాని నగరంలో వేసవిలో తాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని జలమండలి ఎండీని ఆదేశించారు. రోజువారీగా శానిటేషన్, విపత్తుల నిర్వహణ, తాగునీటి మౌలిక వసతులు, శాశ్వత పరిష్కారానికి ఈ సమీక్ష సమావేశంలో అధికారులతో చర్చించారు. మహానగరానికి పొంచి ఉన్న తాగునీటి ఎద్దడిని ముందుగానే గుర్తించి నమస్తే తెలంగాణ ఇటీవల వెలుగులోకి తీసుకువచ్చిన అంశాలే ప్రధాన అజెండాగా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గ్రేటర్ అధికారులతో జరిగిన తొలి సమావేశంలోనే ప్రస్తావించడం విశేషం.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలను సీఎం రేవంత్ దృష్టికి తీసుకుపోతామన్నారు. బల్దియా అభివృద్ధిపై ప్రభుత్వం సానుకూలంగానే ఉందన్నారు. రాష్ట్రంలో పట్టణ అభివృద్ధికి కేంద్ర సహకారం తీసుకుంటామన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాజెక్టులకు రూ. 2వేల కోట్ల నిధులు అవసరమని అధికారులు తెలిపినట్లుగా మంత్రి వెల్లడించారు.
జిల్లాల ఇన్చార్జి మంత్రులకు రూ. 10 కోట్ల నిధులను సీఎం రేవంత్ కేటాయించారని, వాటితో అత్యవసరంగా చేపట్టే పనులు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. అదేవిధంగా ప్రతి నెల 1-5 తేదీల్లోపు జీహెచ్ఎంసీ ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అత్యవసర నిధుల కేటాయింపులపై మంత్రికి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ ఇమేజ్ పెంచేందుకు ప్రభుత్వానికి అన్ని విధాలుగా బల్దియా సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, అడిషనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, శివకుమార్ నాయుడు, జయరాజ్ కెన్నెడీ, సరోజ, ఉపేందర్ రెడ్డి, యాదగిరిరావు, సీఈ దేవానంద్, కిషన్, సురేష్ కుమార్, జోనల్ కమిషనర్లు అభిలాష అభినవ్, రవికిరణ్, పంకజ, వెంకన్న, సీఎంహెచ్ డాక్టర్ పద్మజ, చీఫ్ వెటర్నరీ అధికారి అబ్ధుల్ వకీల్, చీఫ్ ఎంటమాలజిస్ట్ డా. రాంబాబు, హౌజింగ్ ఎస్ఈ విద్యాసాగర్, జోనల్ అధికారులు పాల్గొన్నారు.
గ్రేటర్ పరిధిలో చేపట్టిన, భవిష్యత్లో జరిగే పనులను విభాగాల వారీగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ముఖ్యంగా ఎస్ఎన్డీపీ ద్వారా నాలా అభివృద్ధి పనుల పురోగతిపై మంత్రికి వెల్లడించారు. ఇక వాటర్ బోర్డు ఎండీ సుదర్శన్ రెడ్డిని గ్రేటర్ జలమండలి స్వరూపాన్ని పేర్కొన్నారు. గతంలో చేపట్టిన 31 ఎస్టీపీల నిర్మాణాలు, వాటి పురోగతి, కేంద్రప్రభుత్వం అమృత్ పథకంలోని మరో 35ఎస్టీపీలకు పంపిన ప్రతిపాదనలు, మురుగునీటి శుభ్రత, ఎస్టీపీలతో మూసీ నది అభివృద్ధి చేయవచ్చన్నారు.