హైదరాబాద్: నిర్వహణ పనుల పేరుతో హైదరాబాద్‌లో (Hyderabad) అధికారికంగా కరెంటు కోతలు (Power Cut) విధిస్తున్నారు. రాబోయే వేసవి కాలం దృష్ట్యా మరమ్మతు పనుల్లో భాగంగా ప్రతిరోజూ 2 గంటలపాటు కోతలను అమలుచేస్తున్నారు. అయితే 2 గంటలకు మించే కరెంటు పోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరెంటు కోతల నేపథ్యంలో ఉప్పల్ (Uppal) స్కైవాక్ (Skywalk) లిఫ్ట్‌ను అధికారులు బంద్ చేశారు. పవర్ కట్ వల్ల లిఫ్ట్ పనిచేయడం లేదని ఓ నోటీసు అంటించారు. దీంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందిపడుతున్నారు. శీతాకాలంలోనే విద్యుత్ బంద్ చేస్తే మరి వేసవి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
వేసవి, రబీ సీజన్ లో అధిక విద్యుత్ డిమాండ్ కు సిద్ధం కావడానికి వార్షిక నిర్వహణలో భాగంగా రెండు గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ ముషారఫ్ అలీ ఫారుక్కి వెల్లడించారు. ఫిబ్రవరి 10 వరకు ఈ కోతలు అమలులో ఉంటాయని తెలిపారు. జంటనగరాల్లో 11 కేవీ సామర్థ్యం కలిగిన 2400 ఫీడర్లున్నాయని.. ప్రతి ఏడాది నవంబర్, డిసెంబర్లలో మరమ్మతులు చేపట్టే వారని.. ఎన్నికల కారణంగా జనవరిలో మరమ్మతులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ప్రతిరోజు 100 ఫీడర్స్ పరిధిలో కేవలం రెండు గంటల లోపు మాత్రమే విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.