సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ అడ్వర్టయిజ్మెంట్ వింగ్‌లో ఏండ్ల తరబడి పాతుకుపోయిన ఔట్ సోర్సింగ్ నుంచి అధికారుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రకటన ఏజెన్సీల నుంచి ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతూ సంస్థకు గండి పడుతుండడం..అడ్వర్టయిజ్మెంట్ వింగ్‌లోని కీలక డేటాను పెన్ డ్రైవ్ లలో కాపీ చేసి అడ్డగోలు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగిపై కమిషనర్ ఇటీవల వేటు వేశారు. మరో అధికారిణి బదిలీ చేశారు.
ఒక పక్క ప్రకటన విభాగంలో ప్రక్షాళన పర్వం జరుగుతున్నప్పటికీ దాదాపు పదేండ్ల నుంచి ఈ విభాగంలో తిష్ట వేసిన అధికారిణి ప్రకటన ఏజెన్సీల నుంచి నయా దందాకు తెరలేపినట్లు ప్రచారం సాగుతున్నది. బదిలీ వేటు పడిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి వెన్నుదన్నుగా నిలిచిన అధికారిణి ‘కమీషన్ ఇస్తేనే బకాయిలు మాఫీ చేస్తా.. లేదంటే కొరడా ఝుళిపిస్తా’..ప్రచారాన్ని నిలిపివేస్త్తా అంటూ ఏజెన్సీలను బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విభాగంలో చర్చ జరుగుతున్నది.
ఎల్బీనగర్లో తన ఇంటి కేంద్రంగా చేసుకుని దారికి వచ్చే ఏజెన్సీలతో బేరసారాలకు దిగుతూ సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలుస్తున్నది. ప్రకటన ఏజెన్సీలు జీహెచ్ఎంసీకి చెల్లించాల్సిన ఫీజులు కొందరు భారీగా బకాయిపడడంతో వెంటనే వారికి నోటీసులు ఇచ్చి వసూళ్లు రాబట్టాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ ప్రియాంక ఆల ఇటీవల సంబంధిత విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. సదరు బకాయిలు ఉన్న ఎజెన్సీలు జీహెచ్ఎంసీ పిలవబోయే టెండర్లకు అనర్హులుగా ప్రకటిస్తామన్న నిబంధన పెట్టడంతో బకాయిల చెల్లింపులు ఆయా ఏజెన్సీలకు అనివార్యమైంది. ఇదే అదనుగా సదరు అధికారిణి కమిషన్ ఇస్తే బకాయిల భారాన్ని తగ్గిస్తా…అంటూ తన చేతిలో ఉన్న అస్ర్తాన్ని వినియోగిస్తూ సంస్థకు వచ్చే ఆదాయాన్ని దారి మళ్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
సాధారణంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం మూడేండ్లు దాటితే బదిలీ కావాలి. కానీ, ఈ షాడో అధికారిణికి మాత్రం ఆ రూల్స్ వర్తించవు. తనకున్న రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారులు, కొందరి బడా ప్రకటనల ఏజెన్సీ ప్రతినిధుల అండదండలతో ఏండ్ల తరబడి ఒకే విభాగంలో తిష్టవేసి చక్రం తిప్పుతున్నారు. సదరు విభాగంలో ఏ ఫైలు కదలాలన్నా, ఏ ఏజెన్సీకి అనుమతి రావాలన్నా క్షేత్రస్థాయిలో సదరు అధికారిణి గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి.
సదరు అధికారిణి మొత్తం యంత్రాంగాన్ని నడిపిస్తూ, కమిషనర్ ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. నగరంలో హోర్డింగ్ లు, యూనిపోల్స్ నిర్వహించే ఏజెన్సీల నుంచి జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం రావాల్సి ఉంది. అయితే ఈ బకాయిలను వసూలు చేయడంలో సదరు అధికారిణి ద్వంద్వ నీతిపై ఉన్నతాధికారులు స్పందించాలన్న డిమాండ్ పలు ఏజెన్సీల ప్రతినిధుల నుంచి వ్యక్తమవుతున్నాయి.