మేడ్చల్/శామీర్పేట, మే 17: ‘కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది’ అన్న చందంగా మారింది ఇందిరమ్మ లబ్ధిదారుల పరిస్థితి. నిబంధనలు డబ్బల మంజూరుకు అడ్డంకిగా మారాయి. అధికారులు అవగాహన కల్పించడంలో లోపమో, లబ్ధిదారులకు తెలియక జరగడమో కానీ ఇంటి నిర్మాణ విస్తీర్ణంలో వచ్చిన తేడాలు మొదటికే మోసం తెచ్చిపెట్టాయి. కోటి ఆశలతో, ఉన్న ఇంటిని కూలగొట్టుకుంటే…కొత్త ఇంటికి బిల్లు రాకపోవడంతో లబ్ధిదారులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇదీ పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల పరిస్థితి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన మూడుచింతపల్లి మండలం కేశవరం గ్రామానికి 101 ఇండ్లు మంజూరయ్యాయి. అధికారులు పలు దఫాలుగా లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి.. ఇళ్ల నిర్మాణంపై సూచనలు చేశారు. ఇప్పటివరకు 32 నిర్మాణాలు ప్రారంభం కాగా మొదటి విడతగా నలుగురికి మాత్రమే రూ.లక్ష డబ్బులు మంజూరయ్యాయి. మరో ఇద్దరికి త్వరలో మంజూరవుతాయని అధికారులు చెబుతున్నారు. అయితే 32 ఇండ్లలో ఏడింటికి వివిధ కారణాలతో బిల్లులు మంజూరు కాని పరిస్థితి.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ఆది నుంచే స్పష్టత కొరవడింది. అధికారులు మొదట మీకు ఉన్న స్థలంలో ఎంత విస్తీర్ణంలోనైనా కట్టుకోవచ్చు. కానీ ఇచ్చేది మాత్రం రూ.5లక్షలు అని చెప్పారని లబ్ధిదారులు చెబుతున్నారు. అంతేగానీ ఇంతే విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం జరిగితేనే డబ్బులు వస్తాయని ఎక్కడా చెప్పలేదని చెప్పారు. ఈ క్రమంలో మొదట 9 పిల్లర్లతో 400 చదరపు అడుగులకు తక్కువ కాకుండా నిర్మించాలని అధికారులు తెలిపారు. ఆ తర్వాత క్రమక్రమంగా విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది. 400 నుంచి 450, ఆ తర్వాత 500 ఎస్ఎఫ్టీకి పెరిగి, చివరకు 600 ఎస్ఎఫ్టీకి స్థిరపడింది. ఇప్పుడు ప్రభుత్వం 600 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం జరిగితే డబ్బులు రావని తేల్చి చెబుతున్నారు.
కేశవరం గ్రామంలో 32 ఇండ్ల నిర్మాణం ప్రారంభమైతే నాలుగింటికి మొదటి విడత రూ.లక్ష బిల్లులు వచ్చాయి. ఏడింటికి మొదటి విడత బిల్లు మంజూరుకు అవసరమైన మేరకు నిర్మాణం జరిగినా బిల్లు రాని పరిస్థితి ఏర్పడింది. తమకు స్థలం ఉంది కదా అని ఇద్దరు లబ్ధిదారులు కొంత విస్తీర్ణం పెంచుకొని.. అదనంగా అయ్యే డబ్బులను తామే భరించుకుందామని భావించారు. మిగితా వారు మెట్లకు సరిపోలేదని, మేస్త్రీ ఒక అడుగు జరిగి కట్టడం వల్ల 600 ఎస్ఎఫ్టీ కంటే విస్తీర్ణం ఎక్కువై బిల్లలు రాని పరిస్థితి. ప్రతీ స్టేజీలో ఇంటి నిర్మాణాన్ని హౌజింగ్ యాప్లో అప్లోడ్ చేస్తారు. ఆన్లైన్లో నిబంధనల మేరకు నిర్మాణం జరిగితే బిల్లు మంజూరవుతుంది, లేదంటే అనర్హతగా గుర్తిస్తారు. ఇద్దరి లబ్ధిదారులు నిర్మాణం 750 ఎస్ఫ్టీకి పైనే జరుగగా మిగితా వారివి మాత్రం 612 నుంచి మొదలు కుంటే 625 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో జరిగాయి. ఈ కొద్ది విస్తీర్ణం పెరుగుదలకే బిల్లులు ఇవ్వకపోవడమేమటని.. తాము ఉన్న ఇల్లును కూలగొట్టి ఇంటి నిర్మాణం చేపడితే ప్రభుత్వం ఇంత అన్యాయంగా వ్యవహరించడం ఏమిటని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేశవరం గ్రామానికి చెందిన చెన్నూరు లింగం ఉన్న ఊరిలోనే క్షౌర వృత్తి నిర్వహిస్తున్నాడు. కష్టపడి, అప్పులు చేసి.. తన ముగ్గురు కుమార్తెల పెళ్లిళ్లు చేశాడు. ఆయన భార్య చెన్నూరి లింగమ్మకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో శిథిలావస్థకు చేరుకున్న పెంకుటిల్లును కూలగొట్టాడు. ఆయన నిర్మిస్తున్న ఇంటి వెనుక భాగంలో మెట్ల కోసం కొద్దిగా ముందుకు జరిగి నిర్మాణం చేపట్టాడు. దీంతో విస్తీర్ణం 625 చదరపు అడుగులకు పెరిగింది. అధికారులు కొలిచి.. బిల్లు రాదని నిర్ధారించారు. దీంతో ఆయన భయపెడి వేసిన పిల్లర్లు, ప్లింత్బీమ్లను కూల్చివేశాడు. లోపలికి జరిగి తిరిగి గుంతలను తీశాడు. మళ్లీ గుంతలు, పిల్లర్లు, ప్లింత్ బీమ్ల నిర్మాణం చేపట్టేందుకు అదనంగా దాదాపు రూ.80వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమది నిరుపేద కుటుంబం అని.. రెండు సార్ల పని చేసుండంటే కష్టం కదా’ అని లబ్ధిదారురాలు లింగమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.
‘మొదట మీటింగ్ పెట్టినప్పడు మీరెంతెనన్న కట్టుకోండి రూ.5లక్షలు మాత్రమే వస్తాయన్నారు. మాకు జాగా పెద్దగా ఉంది, నలుగురు ఆడపిల్లలు, ఒక కొడుకు.. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో పెద్ద పెంకుటిల్లు కూలగొట్టి ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం. మంచిరోజు ఉందని సౌకోట్ పెట్టుకున్నాం. ఇప్పుడు సౌకోట్ తీసి, ఆరు పిల్లర్లకు మార్చాలని, మూడు పిల్లర్లను కూలగొట్టాలని అంటున్నారు. అప్పుడే పైసలు వస్తయంట. అట్ల కూలగొడితే మేం మళ్లీ కట్టకోగలమా. నాకు నలుగురు బిడ్డలు, అల్లుళ్లు, మనువరాళ్ల కలిసి వస్తే రెండు రూంలు సరిపోతయా. గిట్ల అయితది అనుకుంటే మాకు ఉన్న పెంకుటిల్లు కూలగొట్టేటోళ్లమే కాదు’ అని లబ్ధిదారులు పార్వతమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా చేస్తే తామెప్పుడు సొంత ఇండ్లు నిర్మించుకోగలుగుతామని.. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నిబంధనలు పాటిస్తేనే బిల్లులు వస్తాయి. నిర్మాణ విస్తీర్ణం 400 ఎస్ఎఫ్టీ కంటే ఎక్కువ 600 ఎస్ఎఫ్టీలోపు ఇండ్ల నిర్మాణం జరిగితే డబ్బులు వస్తాయి. 612 నుంచి 625 ఎస్ఎఫ్టీ వరకు జరిగిన ఇండ్ల నిర్మాణ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన కూడా బిల్లులు ఇవ్వాలంటూ సిఫార్సు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే మేము వ్యవహరిస్తున్నాం. ముగ్గు పోసేటప్పుడు ఉన్న కొలతలు నిర్మాణం జరిగేటప్పుడు ఉండటం లేదు. నిబంధనల్లో ఏమైనా మార్పు వస్తే గానీ ఏమి చేయలేం. అప్పటి వరకు 601 విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం జరిగినా డబ్బులు మంజూరు కావు. లబ్ధిదారులు నిబంధనల ప్రకారమే ఇండ్లు నిర్మించుకోవాలి.
– అల్లాజీ, హౌజింగ్ ఏఈ, మూడుచింతపల్లి మండలం