సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): నెలల తరబడి జీతాలు లేక ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తించే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలతో చాలీచాలని వేతనాలతో బతుకుబండిని ఈడ్చుకొస్తున్న నిరుపేద ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో పస్తులుండాల్సిన దుస్థితి నెలకొందని బాధితులు వాపోతున్నారు. చేసేదిలేక బాధిత ఉద్యోగులు ఆందోళనలబాట పడుతున్నారు.
ఈ క్రమంలోనే మొన్న ఉస్మానియా, నిన్న నిమ్స్, నేడు ఫీవర్ హాస్పిటల్ ఇలా రోజుకు ఒక చోట ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ధర్నాలతో దవాఖానలు దద్దరిల్లుతున్నాయి. అంతంత మాత్రం జీతాల్లో ఏజెన్సీల అక్రమ కోతలు, పదిమంది చేయాల్సిన పనిని ఐదు మందితో చేయించి శ్రమదోపిడీకి పాల్పడుతున్న కాంట్రాక్టర్ల నడుమ ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు నలిగిపోతున్నారు. తమ సమస్యలను అటు దవాఖానల్లోని అధికారులు, ఇటు కాంట్రాక్టర్లు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా మూడు నెలల వేతనాలను తక్షణమే విడుదల చేయాలని కోఠిలోని ఎన్హెచ్ఎం కమిషనరేట్ కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం జాక్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలకు చెందిన 78 క్యాడర్ల ఉద్యోగులు గురువారం మహాధర్నా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులందరూ సమయానికి జీతాలు తీసుకుంటున్నారని,నిత్యం శ్రమిస్తూ వెట్టిచాకిరీ చేస్తున్న ఉద్యోగులకి మాత్రం జీతాలు సరైన సమయంలో రావడం లేదని ఎన్హెచ్ఎం జాక్ ప్రతినిధి డాక్టర్ నాగరాజు మండిపడ్డారు.
జీతాలు ఇచ్చినప్పుడు తీసుకోవాలి..వేతనాల్లో కోతలు ఉంటాయి. పనిభారం ఉంటుంది. ఇవన్నీ కామన్..ఇష్టం ఉంటే చేయండి. లేకపోతే మానేయండి. రూల్స్ గీల్స్ మాట్లాడితే, ఆందోళనలు చేస్తే రేపటి నుంచి రానవసరం లేదు..అంటూ నిమ్స్, ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్, ఎంఎన్‌జే, సుల్తాన్‌బజార్, పేట్లబుర్జ్ ప్రసూతి తదితర దవాఖానల్లోని కాంట్రాక్ట్ ఏజెన్సీలు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధిత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కొన్ని రోజులుగా నిమ్స్, ఉస్మానియా, ఫీవర్ దవాఖాన తదితర దవాఖానలో సకాలంలో జీతాలు అందకపోవడంతో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు బహిష్కరించి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.