Hyderabad Metro | సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక సమస్యతో హైదరాబాద్ మెట్రో రైలు సేవలకు అంతరాయం కలిగింది. సాయంత్రం ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళ్తున్న మెట్రో రైలు ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్‌కు వచ్చిన తర్వాత రైలు తలుపులు తెరుచుకోవడంతో 15-20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు బయటకు వెళ్లేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. సాంకేతిక సమస్యతో నిలిచిపోయిన మెట్రో రైలు లోపల గాలి ఆడక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కొంత సమయం తర్వాత ఎమర్జెన్సీ డోర్ తెరిచి ప్రయాణికులు బయటకు వచ్చారు. అదేవిధంగా ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో ఎగ్జిట్ (బయటకు వెళ్లే) తలుపులు తెరుచుకోలేదు. దీంతో ఒక్కసారిగా వందలాదిగా వచ్చిన ప్రయాణికులు అక్కడి స్టేషన్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అత్యంత రద్దీగా ఉండే సాయంత్రం వేళల్లోనే రెండు చోట్ల మెట్రో స్టేషన్, రైలులో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 20 నిమిషాల తర్వాత మళ్లీ మెట్రో రైళ్లు యథావిధిగా రాకపోకలు సాగించారు.
నగరంలో సాయంత్రం కురిసిన వర్షానికి మెట్రో మార్గాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తిందని, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న ట్రాన్స్‌కో ఫీడర్‌కు విద్యుత్ సరఫరా ట్రిప్ కావడంతో సుమారు 7 నిమిషాల పాటు విద్యుత్ నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా మియాపూర్‌లోని విద్యుత్ ఫీడర్ నుంచి సరఫరా చేసి మెట్రో సేవలను కొనసాగించామని అధికారులు వివరించారు.