Suicide | మారేడ్పల్లి, జూలై 15 : రైలు పట్టాల పక్కన ఉన్న స్తంభానికి చొక్కాతో ఉరివేసుకొని గుర్తు తెలియని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మంగళవారం తెల్లవారుజామున కేవలరీ బేరక్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఓహెచ్ఈ పోల్కు ఓ గుర్తు తెలియని వ్యక్తి (40) తన చొక్కాతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఎంఎంటిఎస్ ట్రైన్ పెట్రోలింగ్ విధుల్లో వెళ్తున్న సిబ్బంది గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి వెళ్లిన సిబ్బంది మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించగా మృతుడి వద్ద ఎలాంటి చిరునామా గుర్తింపు వివరాలు లభ్యం కాలేదు. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని గాంధీ మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.