భారత ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డులు ఇవే ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఫొటోతో కూడిన పాస్బుక్, లేబర్ శాఖ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్పీఆర్, ఆర్జీఐ స్మార్ట్ కార్డు, పాస్పోర్టు, ఫొటోగ్రాఫ్తో కూడిన పింఛన్ డాక్యుమెంట్, ఫొటోతో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సర్వీస్ ఐడీ కార్డు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఐడీ కార్డు, సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ జారీ చేసి యూనిక్ డిజబులిటీ ఐడీ కార్డు.
సిటీబ్యూరో, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ): ఓటర్ ఎపిక్ కార్డు లేకుండా భారత ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడించారు. ఎన్రోల్ జాబితాలో పేరు సరిచూసుకుని, ఆధార్ కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఫొటోతో కూడిన పాస్బుక్, లేబర్ శాఖ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, ఎన్పీఆర్, ఆర్జీఐ స్మార్ట్ కార్డు, పాస్పోర్టు, ఫొటోగ్రాఫ్తో కూడిన పింఛన్ డాక్యుమెంట్, ఫొటోతో కూడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సర్వీస్ ఐడీ కార్డు, ఎంపీ, ఎంఎల్ఏ, ఎంఎల్సీ ఐడీ కార్డు, సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ జారీ చేసి యూనిక్ డిజబులిటీ ఐడీ కార్డు ఉంటే ఓటు హక్కును వినియోగించవచ్చన్నారు.
జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పడక్బందీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ మాట్లాడారు. అక్టోబర్ 4న ప్రచురితమైన తుది ఓటర్ జాబితా అనంతరం 1,35,756 దరఖాస్తులు అందాయని, ఇందులో 83 వేలు క్లియర్ చేశామన్నారు. ఓటర్ చిరునామాను మార్చుకునే అవకాశం ఉన్నదని సంబంధిత బీఎల్ఓ లేదా ఓటర్ హెల్ప్ లైన్ అప్లోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి రోజు 15 వేల వరకు నూతన ఓటర్ నమోదుకు దరఖాస్తులు అందాయని తెలిపారు. ఫారం-8 ద్వారా 1.032 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 45 వేల డూప్లికేట్, డెత్ ఓటర్లను తొలగించినట్లుగా వివరించారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లుగా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశామన్నారు. నామినేషన్లకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. సంబంధిత కార్యాలయాలన్నీ వీడియో సర్వైలెన్స్లో ఉంటాయన్నారు. ఆర్ఓ కార్యాలయాల వద్ద వంద మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, ఆర్వో అధికారి వద్దకు ఐదుగురు మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యాలయంలో ప్రతి కదలికపై వీడియో చిత్రీకరణ జరుగుతుందన్నారు.
నవంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. నవంబర్ 15న విత్ డ్రా తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులపై క్లారిటీ వస్తుందన్నారు. ఆ వెంటనే ఇంటింటికీ వెళ్లి ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ జరుగుతుందన్నారు. ఇప్పటికే మొదటి దశ ఈవీఎంల పరిశీలన పూర్తి కాగా, జిల్లాలోని 15 నియోజకవర్గాల్లోని ఆర్వోలకు అందజేసినట్లుగా తెలిపారు. నవంబర్ 15 తర్వాత రెండో దశ పరిశీలన కూడా చేస్తామన్నారు.
పోలీసులు, ఎన్నికల ఫ్లయింగ్ స్కాడ్ పట్టుకున్న నగదు, బంగారం, ఇతర విలువైన వస్తు సామగ్రిని విడుదల చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నట్టు ఎన్నికల అధికారి తెలిపారు. హైదరాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ సభ్యులు రోజువారీ విచారణ చేసి వెంటనే విడుదల చేస్తున్నారన్నారు.