బన్సీలాల్ పేట్, మార్చి 2 : వరంగల్‌లోని మామునూరులో నూతన విమానాశ్రయాన్ని నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కేంద్ర పౌర, విమానయాన శాఖ మంత్రి కింజారాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని సేకరించి ఇస్తే వెంటనే పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ వార్తను ప్రజలతో పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.
హైదరాబాద్‌లోని సీజీవో టవర్స్‌లోని పీఐబీ సెమినార్ హాల్లో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డితో కలిసి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. దేశంలోని ముఖ్యమైన రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఇప్పటివరకు కేవలం ఒకే ఒక విమానాశ్రయం ఉన్నదని ఆయన అన్నారు. దీర్ఘకాలంగా ఉన్న ప్రజల డిమాండ్ దృష్టిలో పెట్టుకొని వరంగల్ సమీపంలోని మామునూరులో మరొక నూతన ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమని ఆయన అన్నారు.
దేశానికి స్వాతంత్రం రాకముందే 696 ఎకరాలలో మామూనూర్‌లో విమానాశ్రయం ఉండేదని రామ్మోహన్ నాయుడు గుర్తుచేశారు. 1981 వరకు అక్కడ విమాన సేవలు కొనసాగాయని ఆయన తెలిపారు. ఆ ఎయిర్‌పోర్టులో కేవలం 1800 మీటర్ల రన్ వే మాత్రమే ఉన్నదని, అది కూడా శిథిలావస్థకు చేరిందని పేర్కొన్నారు. సాధారణంగా ఎయిర్‌పోర్టు కోసం 2800 మీటర్ల రన్ వే ఉండాలనే నిబంధనలు ఉన్నాయని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 280 ఎకరాల స్థలాన్ని సేకరించాలని కోరడం జరిగింది చెప్పారు. ఇందుకోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్థల కొనుగోలు కోసం జీవో జారీ చేసిందని దీంతో నూతన ఏర్పాటుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా మామునూరులో టెర్మినల్ భవనాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణం జరిగితే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే కాకుండా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని, ఉత్పత్తుల రంగానికి లాభం చేకూరుతుందని ఆయన అన్నారు.
అత్యధిక జనాభా ఉన్న చిన్న చిన్న నగరాల్లో సైతం నూతన ఎయిర్‌పోర్టులను నిర్మిస్తున్నామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణలో కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ద, నిజామాబాద్‌లోని జక్రాన్ పల్లి లో కూడా నూతన విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదన వచ్చాయని పేర్కొన్నారు. వాటి అనుకూలతపై విమానయాన శాఖ సర్వే నిర్వహిస్తుందని అన్నారు. 2008లో హైదరాబాద్లోలోని శంషాబాద్ సమీపంలో జీఎంఆర్ సంస్థ ద్వారా అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు జరిగిందని, 150 కిలోమీటర్ల లోపు రాబోయే 25 ఏళ్ల వరకు ఎలాంటి విమానాశ్రయాలు ఏర్పాటు చేయకూడదని అప్పట్లో షరతులు విధించడం జరిగిందని ఆయన తెలిపారు. అయితే ఇటీవల జీఎంఆర్ సంస్థ జనరల్ బాడీ మీటింగ్లోచర్చించి వారి తరఫు నుంచి క్లియరెన్స్ సర్టిఫికెట్ తీసుకున్నామని తెలిపారు.
కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియాను కలిసి వరంగల్ లో ఎయిర్ పోర్టు నిర్మించాలని పలుమార్లు కోరడం జరిగిందని గుర్తుచేశారు. తెలంగాణలో అనేక చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని, ఇక్కడ సంస్కృతి ఎంత గొప్పదని ఆయన అన్నారు. ముఖ్యంగా రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు కోసం జరిగిన ఓటింగ్ లో మొదటిసారి ఓటమి గురయ్యమని, రామప్ప గుడికి దగ్గరలో ఎయిర్ పోర్ట్ లేకపోవడమే ఇందుకు కారణమని తెలిసిందన్నారు. దాంతో అప్పట్లోనే త్వరలో తాము వరంగల్ లో నూతన ఎయిర్ పోర్ట్ నిర్మిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాలకు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పారు. హామీలకు ఆయన ప్రస్తుతం మామునూరులో నూతన ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా తెలంగాణకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని అన్నారు. వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.