సెప్టెంబర్ 17.. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వెన్నల పతాకాన్ని ఆవిష్కరించారు. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లలో మంత్రులు సబితారెడ్డి, చామకూర మల్లారెడ్డిలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. సమైక్యతా స్ఫూర్తిని చాటి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకుందామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన సాగుతుందని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సంక్షేమ, అభివృద్ధి రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా ఉన్నదని వారు పేర్కొన్నారు.
– రంగారెడ్డి/మేడ్చల్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ) : సమైక్యతా స్ఫూర్తిని చాటి బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకుందామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ ఫలాలు అర్హులైన వారికి అందేలా చూడటంతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ముందుకు సాగుదామన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం కొంగర కలాన్‌లోని రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ నేలపై జరిగిన అనేక పోరాటాలు, అనతికాలంలోనే జిల్లాలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై ప్రసంగించారు.
వీరయోధుల త్యాగ ఫలితమే స్వేచ్ఛ తెలంగాణ
భారత్‌లో హైదరాబాద్ అంతర్భాగమైన రోజును జాతీయ సమైక్యతా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వేలాది మంది ప్రాణ త్యాగాల ఫలితమే నేటి స్వేచ్ఛ తెలంగాణ అని పేర్కొన్నారు. స్వామి రామానంద తీర్థ, సర్దార్ జమలాపురం కేశవరావు, వట్టికోట అళ్వార్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, కుమ్రం భీం, రావి నారాయణ రెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, నల్లా నర్సింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, దేవులపల్లి వెంకటేశ్వరరావులకు ఈ సందర్భంగా నివాళులర్పించారు. రచనలతో ఉత్తేజాన్ని, ఉద్వేగాన్ని నింపిన సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతుల స్ఫూర్తిదాయక కృషిని స్మరించుకుందామన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించి పద్నాలుగేండ్లు అవిశ్రాంత పోరాటం చేశారన్నారు. మొక్కవోని దీక్షతో చేపట్టిన ఉద్యమం ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు.
స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమం..
సంక్షేమం, అభివృద్ధి పరంగా రంగారెడ్డి జిల్లా దూసుకెళ్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని తెలిపారు. రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి వ్యవసాయాన్ని పండుగ చేశారని పేర్కొన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసిందని చెప్పారు. రైతు బీమా పథకం ద్వారా రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామని తెలిపారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 66 బస్తీ దవాఖానలు, 158 పల్లె దవాఖానలు, 25 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని వివరించారు. మత్స్యశాఖ ద్వారా వంద శాతం సబ్సిడీతో ఈ ఏడాది 641 చెరువుల్లో 1.2కోట్ల చేప పిల్లలను వదిలామన్నారు.
అనతికాలంలోనే సమగ్ర అభివృద్ధి..
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 464 పాఠశాలలు ఎంపిక కాగా.. 448 పాఠశాలలకు రూ.97.88కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు ఇచ్చామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 65 పాఠశాలల్లో పనులను పూర్తి చేసి ప్రారంభించామన్నారు. అక్టోబర్ 24 నుంచి బడి పిల్లలకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ అందుబాటులోకి రానుందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారా 1,747 పరిశ్రమలకు రూ.78,798కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులతో అనుమతులు లభించగా… 1,358 పరిశ్రమలను రూ.62,952 కోట్ల పెట్టుబడులతో స్థాపించి 7.25లక్షల మందికి ఉపాధి కల్పించామన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించి సీఎం కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేశారని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద రంగారెడ్డి జిల్లాలోని 330 గ్రామాలకు చెందిన 3,59,047 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందుతుందని, తాగు నీటి గోస కూడా తీరుతుందని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, జడ్పీ చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, మహేశ్వరం డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, ఏసీపీ శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, కలెక్టరేట్ ఏవో ప్రమీల రాణి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.