చిక్కడపల్లి, జూన్19 : చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్లాక్ టీ షర్టులు ధరించిన నిరుద్యోగులు కేక్ కట్ చేసి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని రాహల్, సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాహుల్ ది ‘మొహబ్బత్కి దుకాణ్ కాదు మోసాల దుకాణ్’ అని ధ్వజమెత్తారు.
ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీని సందర్శించి నిరుద్యోగులకు అండగా ఉంటామని, అధికారం చేపట్టగానే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. “మా చాయ్ తాగినావ్ మమ్మల్ని ముంచినవు’ ‘నిరుద్యోగుల ఆత్మ హ్యతలకు కారకుడైన రాహల్ గాంధీకి హ్యాపీ బర్త్డే”అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నిరుద్యోగ జేఏసీ నాయకులు.. రవికుమార్, శంకర్ నాయక్, మధుసూదన్ గౌడ్, గణేష్ తదితరలు పాల్గొన్నారు.