చిక్కడపల్లి: చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయం ప్రైవేట్ సంస్థలకు అడ్డాగా మారుతున్నదని నిరుద్యోగ విద్యార్థులు మండిపడుతున్నారు. సభలు, సమావేశాలు నిర్వహించరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారని, ప్రైవేట్ వ్యక్తులకు మాత్రం ఏ విధంగా అనుమతి ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. గ్రంథాలయం భవనం లోపాల ఆదివారం ఓ ప్రైవేట్ దవాఖాన వారు పెద్ద ఎత్తున్న మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కూర్చోని చదువుకునే హాల్ నుంచి వారిని బయటకు పంపించేసి అక్కడ క్యాంప్ సంబంధించిన పరికరాలు ఏర్పాటు చేసుకుని శిబిరాన్ని నిర్వహించారు. దీంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు.
క్యాంప్‌నకు వచ్చిన వైద్యులు, సిబ్బంది కోసం భవనంలో లోపాల ఉన్న ఖాళీ స్థలంలో వంటలు కూడా చేయడంతో దాని వల్ల వచ్చిన పొగలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందు పడ్డారు. అదే విధంగా భోజనాలు కూడా లోపలే పెట్టారని విద్యార్థులు మండిపడ్డారు. డబ్బులు వసూలు చేసి ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలకు అనుమతి ఇస్తున్నారని పలువురు విద్యార్థులు ఆరోపించారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్లు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని విద్యార్థులు చెప్పారు.
గ్రంథాలయాలు క్యాంప్‌లు, ప్రైవేట్ ఫంక్షన్స్ చేయడానికి ఫంక్షన్ హాల్ కాదని నిరుద్యోగ విద్యార్థులు శంకర్ నాయక్, లక్ష్మీకాంత్ ,వెంకటేశ్, శ్రీనివాస్, శివ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు బయట నిర్వహించుకోవాలన్నారు. విద్యార్థులకు కూర్చోని చదువుకునే హాల్లోనుంచి వారిని పంపిచేసి క్యాంప్‌లు నిర్వహించడం ఏమిటని వారు ప్రశ్నించారు.
విద్యార్థులు నోటిఫికేషన్స్ గురించి అడిగితే ఇది ధర్నా చౌక్ కాదని, పోలీస్ కేసులవుతాయని బెదిరిస్తారన్నారు. మరోసారి ఇలాంటి ప్రైవేట్ కార్యక్రమాలకు పునరావృతం అయితే ప్రభుత్వం, లైబ్రరీ చైర్మన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.