ఎల్బీనగర్, జూలై 5: నిరుద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు, హక్కుల పరిష్కారం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేదిలేదంటూ నిరుద్యోగ యువకులు దిల్సుఖ్నగర్ చైతన్యపురిలో ధర్నా నిర్వహించారు. పోలీస్ ఉద్యోగాల్లో 5వేలకే పరిమితం చేయడం దారుణమని , ఖాళీగా ఉన్న 19 వేల పోలీస్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని వారు కోరుతున్నారు.
ధర్నా చేస్తున్న నిరుద్యోగులకు మద్దతుగా తెలంగాణ క్రాంతి వ్యవస్థాపకుడు పృథ్వీరాజ్, ఎమ్మెల్సీ కాంటెస్టెడ్ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. నిరుద్యోగుల ఆందోళన ప్రజాస్వామ్యబద్ధ్దమైనదన్నారు. నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం శోచనీయమన్నారు. తక్షణం నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, ఆకాష్, నవీన్, శంకర్, శింబు, వంశీ, ప్రవీణ్, రాజు, మహేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.