పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని చైతన్యపురిలో నిరుద్యోగులు మంగళవారం చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉద్యోగాలు ఏవంటూ సీఎం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాలను నినదిస్తూ నిరుద్యోగులు చైతన్యపురి నుంచి దిల్సుఖ్నగర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఆ ప్రాంతమంతా నిరుద్యోగుల నినాదాలతో దద్దరిల్లింది. ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్లకార్డులతో ర్యాలీ తీశారు. పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తాము శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని నిరుద్యోగులు పోలీసులకు సూచించినా వినిపించుకోకుండా ర్యాలీ భగ్నానికి ప్రయత్నించారు.
పోలీసు వాహనాల్లో నిరుద్యోగులను తరలించడానికి యత్నించిన సమయంలో పోలీసులకు, నిరుద్యోగులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసు అభ్యర్థులను ఈడ్చుకుంటూ వాహనాల్లో ఎక్కించారు. ఈ క్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రా నాయక్, భూక్య కుమార్‌లను సరూర్‌నగర్ పోలీసులు బలవంతంగా లాక్కుంటూ పోలీసు వాహనంలో తరలించారు. నిరుద్యోగులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని జీపులో ఎక్కించాక వారిపై పిడిగుద్దులతో దాడి చేశారని బాధితులు తెలిపారు. కాగా, భూక్య కుమార్, ఇంద్రానాయక్పై పోలీసులు సెక్షన్ 126/2. 291/5 బీఎన్ఎస్ కింద కేసులు నమోదు చేశారు.
– ఎల్బీనగర్, జూన్ 15
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు విరుచుకుపడ్డారు. పరిపాలన చేతకాకపోతే ఎలా పరిపాలన చేయాలో నేర్పిస్తామని విమర్శించారు. నిరుద్యోగులు గోసపడుతుంటే పట్టించుకోక చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నోటిఫికేషన్ల జారీలో తాత్సారం చేయకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తూ నిరసన గళం విప్పారు. పోలీస్ ఉద్యోగాల్లో వయో పరిమితి పెంపుతో పాటుగా పెండింగ్‌లో ఉన్న అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని వారు డిమాం డ్ చేశారు. తెలంగాణ పోలీస్ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రం నలుమూలల నుంచి నిరుద్యోగ యువత దిల్‌సుఖ్‌నగర్‌కు చేరుకుని మహాధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభు త్వం నిరుద్యోగ యువతకు ఎన్నో ఆశలు చూపి అధికారం లోకి వచ్చాక మొండి చెయ్యి చూపుతోందని వారు విమర్శించారు.
నిరుద్యోగ జేఏసీ నాయకులు మాట్లాడుతూ 19/20 పే స్కేల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని, కానిస్టేబుల్ పోస్టులకు 36 సంవత్సరాలు, ఎస్ఐ పోస్టులకు 38 సంవత్సరాలు వయో పరిమితిని పెంచాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు కోరారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.
తమ సమస్యల పరిష్కారానికి నిత్యం వినూత్నంగా నిరసనలు, ధర్నాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకుని పోతున్నామని, ప్రభుత్వం స్పందించకుండా ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఈ మహాధర్నా కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఇంద్రానాయక్, భూక్య కుమార్, శ్రీనివాస్, నవీన్ పట్నాయక్, షింబూ నాయక్‌తో పాటుగా పలువురు నాయకులు శ్రీనివాస్, నవీన్ పట్నాయక్, శంకర్, ఆకాశ్ గౌడ్, శంకర్, షింబూ నాయక్ తదితరులను నాగోలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరికొందరు నిరుద్యోగ జేఏసీ నాయకులను సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, కోదండరాం రెడ్డి, ఆకునూరి మురళి మీరంతా పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు తమ సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడుతారు? సిగ్గుమాలిన నాయకులు మీరంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కడుపు కాలుతుందని, ఈ మేధావులు మాత్రం పదవుల్లో ఊరేగుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరుద్యోగుల సెగ తగులుతుందని హెచ్చరించారు.
దిల్సుఖ్నగర్ రహదారిపై నిరసనకు దిగడంతో ఇరువైపులా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నిరుద్యోగుల నిరసనతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. తమ నిరసనను రోడ్డుకు ఓ వైపు నుంచి ర్యాలీగా సాగుతూనే దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ సమీపంలోకి రాగానే ఫ్లకార్డులను పట్టుకుని రహదారిపైకి చేరుకుని తమ హక్కుల సాధన కోసం గళమెత్తారు. దీంతో వాహనాలు అన్ని ఎక్కడికక్కడే నిలిపిపోవడంతో ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 15: రాష్ట్రంలో 20 వేల ఎస్సై, పోలీసు కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ మోతీలాల్‌నాయక్ మాట్లాడుతూ.. అయిదు వేల పోలీస్ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేస్తే జీవో నంబర్ 46 ప్రకారం రెండు వేల ఉద్యోగాలు హైదరాబాద్‌కు పోతాయని, మిగిలిన మూడు వేల ఉద్యోగాలు రాష్ట్రంలోని 33 జిల్లాలకు వెళ్తాయని తెలిపారు.
అందుకే 20 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రంలో అగ్నిగుండాన్ని సృష్టిస్తామని హెచ్చరించారు. ఉద్యమాల గడ్డ ఓయూ నుంచి ఒక ఉద్యమాన్ని లేవనెత్తుతామని చెప్పారు. నోటిఫికేషన్లో లాంగ్ జంప్‌ను మూడున్నర కిలోమీటర్లకు కుదించాలని కోరారు. జీవో నంబర్ 46ను రద్దు చేసి అప్లికేషన్ ఫీజును రూ.వెయ్యి నుంచి రూ.వందకు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు అస్మా, ఆర్కే వన్నార్ చోళ, అనిత ముదిరాజ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి, జూన్16: పోలీసు ఉద్యోగాలు 5 వేలు కాకుండా 19 వేలు భర్తీ చేయాలని చిక్కడపల్లిలో నిరుద్యోగులు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖలు రాసి పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగ నోటిఫికేషన్స్ లేక లక్షలాది మంది నిరుద్యోగులు పోలీసు, గ్రూప్స్ ఉద్యోగాల కోసం, మెగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. నిరుద్యోగ జేఏసీ నేతలు కయ్య వెంకటేశ్ కిరణ్, వీరేశ్, సంపత్, మధుసూదన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.