Hyderabad | సిటీబ్యూరో, జూన్ 17(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా అస్తిత్వం కూడా పోగొట్టుకుని నిర్వహణ భారంతోపాటు ఒకవైపు అప్పులు, మరోవైపు నెలనెలా తడిసి మోపెడైన కరెంటు బిల్లులతో సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక ప్రభుత్వం వైపు ఆశగా ఎన్నిసార్లు పరిస్థితిని విన్నవించుకున్నా చలించిన దాఖలాలు లేవు. ఇది తెలంగాణ ఏర్పాటు కాకముందు పరిస్థితి. కానీ 2014లో తెలంగాణ ఏర్పాటు కావడం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నానాటికీ పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దడానికి సీఎం కేసీఆర్ జల మండలికి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ప్రతి బడ్జెట్లోనూ జలమండలికి భారీ నిధులు కేటాయించారు.
సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, పురపాలక మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వం, మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ నాయకత్వంలో అటు తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి శుద్ధిని సమర్థంగా నిర్వహిస్తూ జలమండలి అందరి మన్ననలు పొందుతున్నది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటూ.. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాలకు తాగునీరు అందిస్తూ, నగర శివారు ప్రాంతాల్లో సీవరేజీ నిర్వహణ బాధ్యతలు చేపట్టి తన సేవలను విస్తృతపర్చింది. తెలంగాణ తిరుపతిగా పేరొందిన యాదాద్రి లక్ష్మీనరసింస్వామి దేవాలయం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిసరాల్లో భూగర్భ డ్రైనేజీ, వరద నీటి కాలువ వ్యవస్థల నిర్మాణ బృహత్తర ప్రణాళికను రూపకల్పన చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం జలమండలిపై పెట్టింది.
ఈ బాధ్యతను జలమండలి సమర్థంగా నిర్వహించి పూర్తి చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలోనే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 9 నూతన రిజర్వాయర్లను నిర్మించారు. తర్వాత రూ. 1900 కోట్లతో మరో 56 రిజర్వాయర్లతోపాటు 2వేల కిలోమీటర్ల మేర పైపులైన్ నిర్మాణం చేపట్టారు. దీంతో నగర శివారు మున్సిపాలిటీ పరిధిలోని లక్షలాది మంది తాగునీటి కష్టాలు తొలగిపోయాయి. ఇక 2015లో ఇటు కృష్ణా నది మూడవ దశ, గోదావరి నది నుంచి మొదటి దశ ప్రాజెక్టుల ద్వారా నగరానికి నీటి సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజల తాగునీటి ఇబ్బందులు తగ్గిపోయాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తాగునీటి భవిష్యత్తు అవసరాలకు 20 టీఎంసీల నీటిని తీసుకునే వీలును కల్పించింది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నూతనంగా 31 మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీ), ఎస్టీపీలను ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తోంది. తకువ ధరకే వినియోగదారులకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సేవల్ని అందిస్తోంది. ఇదీ గత తొమ్మిదేళ్ల కాలంలో జలమండలి సాధించిన ప్రగతి.
ఓఆర్ఆర్ లోపల ఉన్న నగర శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలను పరిషరించేందుకు ప్రభుత్వం సెప్టెంబర్ 23న రూ.1,200 కోట్లు మంజూరు చేసింది. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్యల శాశ్వత పరిషారానికి గానూ రూ.1200 కోట్లతో 137ఎంఎల్ సామర్థ్యం గల రిజర్వాయర్ల నిర్మాణానికి, 2100 కి.మీ పైప్‌లైన్ నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ఔటర్‌రింగ్ రోడ్డు లోపలి 183 గ్రామాలు, 7 మున్సిపాలిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.756 కోట్ల వ్యయంతో చేపట్టిన ఓఆర్ఆర్ ప్రాజెక్టు పనులు 2019లో పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. దీంతో 162 రిజర్వాయర్లు, 2వేల కిలో మీటర్ల పైపులైన్ విస్తరణ పనులు జలమండలి చేపట్టింది. ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, షామీర్పేట్, కీసర, కుత్బుల్లాపూర్, ఘట్కేసర్, రాజేంద్రనగర్, హయత్‌నగర్, మహేశ్వరం, ఆర్సీపురం, పటాన్చెరు మండలాల్లోని 183 గ్రామాలు, 7 మున్సిపాలిటీల్లోని ప్రతి ఇంటికి ఈ ప్రాజెక్టు ద్వారా నీరందుతున్నది.
హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి ఎద్దడి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సుంకిశాల ప్రాజెక్టును చేపడుతున్నది. ఇప్పటికే కృష్ణా, గోదావరి డ్రింకింగ్ వాటర్ సపె్లై వివిధ ఫేజుల్లో నగర ప్రజలకు జలమండలి ద్వారా తాగు నీరు అందుతున్నది. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించగా.. నగరానికి వరుసగా ఐదేళ్లు కరువు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, నాగార్జున సాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా.. దీని ద్వారా ప్రజలకు తాగునీరు అందించే వీలుంటుంది. దీనికి 2022 మే 14న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మొత్తం ప్రాజెక్టును 2023 జూన్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి.