సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం, మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏఐ మాయాజాలం సృష్టిస్తున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నుంచి తాజాగా మూసీ పనులకు శంకుస్థాపన సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన ఓంకారేశ్వర స్వామి దేవాలయం నమూనా దాకా అంతా ఏఐ చిత్రాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. శంకుస్థాపన సమయంలో గుడికి సంబంధించిన ఏవీలో రామప్ప దేవాలయాన్ని పోలిన చిత్రాలను ప్రదర్శించారు. శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి సైతం మాట్లాడుతూ.. రామప్ప దేవాలయంలోని శివుడి సాక్షిగా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని, ఆ ఆలయాన్ని పోలిన నిర్మాణాలతో మంచిరేవులలో ఓంకారేశ్వర ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.
మంచిరేవులలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద సనాతన టెంపుల్ కాంప్లెక్స్, పురానాపూల్ వద్ద అతిపెద్ద మసీదు, గౌలిగూడ వద్ద స్వర్ణ దేవాలయం తరహాలో అతిపెద్ద గురుద్వారా, నాగోల్ వద్ద మెదక్ చర్చి కంటే పెద్దదైన చర్చిని నిర్మిస్తామని ప్రకటించారు. ఈ నాలుగింటి నిర్మాణానికి రూ.2500 కోట్లు వెచ్చించనున్నట్లు అంచనా వేశారు. నాలుగు నిర్మాణాలకు సంబంధించిన ఏఐ చిత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. శంకుస్థాపన సందర్భంగా విడుదల చేసిన ఓంకారేశ్వర ఆలయానికి, ప్రభుత్వం తర్వాత విడుదల చేసిన నాలుగు మతాలకు సంబంధించి విడుదల చేసిన చిత్రానికి సంబంధమే లేకుండా పోయింది. ఉదయం సీఎం శంకుస్థాపనలో రామప్ప ఆలయాన్ని పోలిన చిత్రాన్ని ప్రదర్శిస్తే.. సాయంత్రం విడుదల చేసిన చిత్రం దానికి పూర్తి భిన్నంగా ఉన్నది.
ప్రాజెక్టుపై స్పష్టత కరువు
ప్రభుత్వానికి మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టుపై ఒక పక్కా ప్రణాళిక లేదని స్పష్టమవుతున్నది. కనీస అవగాహన లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు. పూటకో మాట, రోజుకో నమూనాలను విడుదల చేస్తూ పరీవాహక ప్రజలను అయోమయానికి గురిచేస్తూ కాలయాపన చేస్తున్నారు. ఏఐ మాయాజాలంతో గందరగోళం సృష్టిస్తున్నారు. గతంలోనూ గాంధీ సరోవర్కు రెండు భిన్నమైన చిత్రాలను విడుదల చేసి అభాసుపాలయ్యారు. ఇలా రోజుకో ఏఐ చిత్రాలను విడుదల చేయడం చూస్తుంటే అటు ప్రభుత్వానికి, ఇటు ఎంఆర్డీసీఎల్ అధికారులకు ప్రాజెక్టుపై ఎలాంటి అవగాహన లేదని తెలుస్తున్నది. ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసే నమూనాలను కనీసం చెక్ చేసుకోకుండా ఎలా వదులుతారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు ప్రభుత్వం దగ్గర స్పష్టమైన ప్రణాళిక ఉన్నదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మసి పూసి మారేడు కాయలమ్మినట్లుగా మూసీ పునరుజ్జీవనం పేరిట భూములను కొల్లగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు బయటపెట్టి ప్రజలకు ప్రాజెక్టుపైనా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఏఐ చిత్రాలతో గందరగోళం
ప్రాజెక్టుపై ఒక నిర్దిష్టమైన స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వం పూర్తిగా ఏఐపై ఆధారపడినట్లు తెలుస్తున్నది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోనూ ఎంఆర్డీసీఎల్ చైర్మన్ విడుదల చేసిన చిత్రాల్లో ఏఐ మాయాజాలంతో అరచేతిలో స్వర్గం చూపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాగోల్ ప్రాంతంలో చేసిన మూసీ సుందరీకరణ చిత్రాలను కూడా ప్రదర్శించి… వాటి నమూనాలో సుందరీకరిస్తామని వెల్లడించారు. అటు రూ. 6500 నుంచి రూ.7 వేల కోట్లతో నిర్మిస్తామని చెబుతున్న గాంధీ సరోవర్ ప్రజెక్టుకు సంబంధించి ఒకసారి ఒకలా మరోసారి ఇంకోలా ఉన్న చిత్రాలను విడుదల చేశారు.
సాక్ష్యాత్తు సీఎం చెప్పినా..
ఇప్పుడు స్వయంగా రామప్ప ఆలయాన్ని పోలిన సనాతన క్షేత్రాన్ని నిర్మిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినా.. దాన్ని మార్చి సాయంత్రానికి మరో చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఏఐలో ఒకసారి ప్రాంప్ట్ ఇస్తే వచ్చిన చిత్రం మరోసారి రాదు. అందువల్లే ఇలా రకరకాల ఊహా చిత్రాలను వదులుతున్నట్లు తెలుస్తున్నది. అయితే ఏఐని నమ్ముకుని ప్రభుత్వం నిర్ణయించిన నమూనాలనే మార్చేస్తుండటం వారి పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్నది. మరోవైపు మూసీ సుందరీకరణ కోసం ఓ కన్సల్టెంట్‌ను నియమించారు. ఇంటర్నెట్లో దొరికే ఏఐ చిత్రాలను పూటకోటి విడుదల చేస్తుంటే కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నియమించిన కన్సల్టెంట్ ఏం చేస్తున్నారని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రభుత్వం ఇప్పటికైనా మూసీ ప్రాజెక్టుపై ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉందా? లేదా? అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు అదేమీ లేకుండా ఇష్టమొచ్చిన ప్రకటనలు చేస్తూ ప్రాజెక్టు స్వరూపం పేరిట నచ్చిన ఫొటోలను విడుదల చేస్తుండటంపై పరీవాహక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం భూములను లాక్కోవడంపైనే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడుతున్నదని మండిపడుతున్నారు.