కుత్బుల్లాపూర్, డిసెంబర్14 : కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రభుత్వ సేవలను పొందేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో బర్త్‌సర్టిఫికెట్ల జారీ పూర్తిగా బేజార్గా మారుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు కొర్రీలు పెడుతున్నారు. గతేడాది నుంచి బర్త్‌సర్టిఫికెట్ల జారీ విషయంలో తప్పనిసరిగా ‘అఫిడవిట్’ జత చేయాల్సిందే అంటూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు. బర్త్ సర్టిఫికెట్ల ఏడు రోజుల కాల వ్యవధిలో..డెత్ సర్టిఫికెట్ల 21 రోజుల్లో పూర్తి కావాల్సిందే.. దవాఖానల నుంచి జారీ చేసి జాబితా ఆధారంగా ఎలాంటి నిబంధన లేకుండా ప్రజలు నేరుగా మీ సేవా ద్వారా రూ.30తో బర్త్,డెత్ సర్టిఫికెట్లను గత ప్రభుత్వ హయాంలో సులభంగా పొందేవారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..?
రూ.400 వరకు అదనపు భారం..
గతేడాది నుంచి నిబంధనలకు అనేక కొర్రీలు అంటగడుతూ ప్రజలను కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేలా చేసిందని పలువురు మండిపడుతున్నారు. వాస్తవానికి జనన ధ్రువీకరణ పత్రం పొందాలనే వారికి పుట్టిన ఏడాది తర్వాత తీసుకుంటే, పేరులో పదాలను సరిచేసుకునేందుకే మాత్రమే అఫిడవిట్‌ను పొందుపర్చాల్సి వస్తుంది. వీటన్నింటికి భిన్నంగా మొదటిసారి ధ్రువీకరణపత్రం పొందాలంటే కూడా అఫిడవిట్ కావాల్సిందే అంటూ అధికారులు చెప్పడం గమనార్హంగా ఉంది. రూ.30 లతో మీ సేవా ద్వారా పొందే ధ్రువీకరణ పత్రానికి అఫిడవిట్‌తో రూ.400 వరకు అవసరాన్ని బట్టి బయట మధ్యవర్తులతో అదనపు భారంతో పాటు కాలయాపనకు జరుగుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనన, మరణ ధ్రువీకరణపత్రాలను సకాలంలో పొందలేని పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు.
విలీన ప్రాంతాల్లో ఇవే తిప్పలా..
జీహెచ్ఎంసీలో విలీనం కాకముందు శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలలో సీడీఎంఏ నిబంధనల మేరకు సకాలంలో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను లబ్ధిదారులు పొందేవారు. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం చేసిన తర్వాత ఆ నిబంధనలు ఇక్కడ కూడా వర్తిస్తే భవిష్యత్‌లో ఆయా ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు తిప్పలు తప్పవా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.