కాంగ్రెస్ పాలనలో నేరాలు పడగవిప్పుతున్నాయి.. శాంతిభద్రతలు పడకేశాయి.. హత్యలు.. లైంగికదాడులు.. గొలుసు దొంగతనాలు, మైనర్లపై అఘాయిత్యాలు.. ఇలా ఎప్పుడేం జరుగుతుందోనని నగరవాసులు హడలిపోతున్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటూ గొప్పలు చెప్పుకొంటున్న రేవంత్ సర్కార్కు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్వయంగా చేపట్టిన క్షేత్ర స్థాయి పరిశీలన చెంపపెట్టుగా మారింది. గంజాయి బ్యాచ్లు, మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు రోడ్లపై హంగామా చేస్తున్నా.. పోలీసు వ్యవస్థ నిస్తేజంగా ఉండిపోవడం వెనుక ప్రభుత్వ డొల్లతనం నేరుగా కనిపిస్తున్నది. ఒక పోలీస్ ఉన్నతాధికారికి రక్షణలేని చోట.. సామాన్య మహిళల పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను వేధిస్తున్న ప్రశ్న.
సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ) : నగరంలో శాంతి భద్రతలు పడకేశాయి. కాంగ్రెస్ పాలనలో మహిళలు స్వతంత్రంగా బయట తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. నెల రోజుల కిందట మెట్రో స్టేషన్ సమీపంలో దంపతులు నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వేధించారు. పట్టుబడ్డ నిందితులు మైనర్లేనని తేలింది. రోడ్డుపై వాకింగ్ చేస్తున్న ఓ యువతిని ఓ వ్యక్తి వెంబడించి.. జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. ఆమె ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్మీడియాలో పెట్టింది. ‘మహిళలకు ఎంతో సురక్షితమైన నగరం అనుకున్నా.. కానీ అది నిజం కాదని ఇవాలే తెలిసిందం’టూ హైదరాబాద్లో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి ఆందోళన వ్యక్తం చేసింది.
అలాగే మహిళలు, పిల్లల కిడ్నాప్ కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తున్నది. గతేడాది రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2024లో 463 ఉండగా, 2025 వచ్చే సరికి 579కి పెరిగాయి. పోక్సో కేసులు సైతం 4 శాతం, హైదరాబాద్లో 6 శాతం, సైబారాద్లో 9 శాతం మహిళలపై జరుగుతున్న నేరాలు పెరిగాయి. కాంగ్రెస్ పాలనలో నగరంలో వ్యవస్థీకృత నేరాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితి నేడు తిరిగి పునారావృతమవుతున్నాయి. మహిళలు ఇంటి ముందు కూడా కనీసం ఒంటరిగా కొద్దిసేపు కూర్చోలేని దుస్థితి నెలకొంది.