Crime News | ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 4: తల్లి మరణాన్ని తాళలేక, మాతృమూర్తి బంధాన్ని వీడలేక ఓ తనయుడు అమ్మతోనే జీవితం అంటూ, అమ్మే తనకు సర్వస్వం అని చాటి చెబుతూ నిండు నూరేండ్ల జీవితానికి ఉరి పోశాడు. తల్లిని మించిన దైవం లేదని ఓ మహాకవి చాటిన కథనాన్ని ఈ అమ్మ కొడుకు ఆత్మహత్యకు పాల్పడి మరో మారు రుజువు చేశాడు. ఈ విషాద ఘటన లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం, లాలాపేటలోని వినోబానగర్ బస్తీలో ఎనిమిదేండ్లుగా లక్ష్మి(43) తన కుమారుడు అభినయ్(22)తో కలిసి అద్దె ఇంటిలో ఉంటుంది.
అభినయ్ ప్రైవేట్ ఉద్యోగి. లక్ష్మి కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే ఆమె ఆరోగ్యం దెబ్బ తిని రెండు రోజుల క్రితం ఇంట్లోనే మృతి చెందింది. తల్లి మృతిని చూసి తట్టుకోలేక అభినయ్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు ఎవరు కారణం కాదంటూ లేఖ రాసి పెట్టాడు. రెండు రోజులుగా తల్లి, కుమారుడి మృతదేహాలు రెండూ గదిలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇంటి పరిసరాల్లో దుర్వాసన వస్తుండటంతో యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.