మేడ్చల్, ఏప్రిల్21(నమస్తే తెలంగాణ): యూఎల్సీ (అర్బన్ సీలింగ్ ల్యాండ్), ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. గ్రామ కంఠం భూములకు సర్వే నంబర్లేక పోవడంతో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మచ్చబోల్లారంలోని యూఎల్సీ 582, 583 సర్వే నంబర్లో ఉన్న 42 ఎకరాలు, అల్వాల్‌లోని బీహెచ్కాలనీ 537, 322 సర్వే నంబర్లో మూడున్నర ఎకరాల భూదాన్ భూముల్లో కబ్జాలు జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అల్వాల్‌లోని 11 ఎకరాల గ్రామ కంఠం భూముల్లో కొందరు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు చేసుకుంటున్నారు.
హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కాలయాపన చేస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామ కంఠానికి చెందిన 11 గుంటల భూమిలో ఫైర్‌స్టేషన్‌కు ప్రభుత్వం కేటాయించినప్పటికీ కబ్జా చేసేందుకు యత్నిస్తున్నట్లు స్థానికులు మండిపడుతున్నారు. కబ్జాలపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తిన ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. భూములు కబ్జాకు గురికాకుండా ఉండేందుకు ప్రజాప్రయోజనాలకు ఉపయోగపడేందుకు వినియోగించాలని, నియోజకవర్గంలో మంజూరైన ప్రభుత్వ దవాఖాన, వివిధ కార్యక్రమాలకు ఉపయోగించాలని రాజశేఖర్‌రెడ్డి మార్చి 2025లో జరిగిన అసెంబ్లీలో ప్రస్తావించిన విషయం విదితమే.
కబ్జాలపై హైడ్రాకు ఫిర్యాదు
నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న కబ్జాలపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి విమర్శించారు. స్థానిక రెవెన్యూ అధికారులు విచారణ చేసి నివేదిక పంపించాలని ఆదేశిస్తూ తప్పించుకుంటున్నారు. హైడ్రా అధికారులు నిరుపేదలకు ఒక తీరు కబ్జాదారులకు మరోతీరుగా వ్యవహరిస్తున్నారు. కబ్జాలపై హైడ్రా అధికారి రంగనాథ్‌కు మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు చర్యలు లేవు. అధికారులు కబ్జాలపై స్పందించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే మర్రి అన్నారు.