సిటీబ్యూరో, జూన్ 15 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ వైపు మెట్రో రైలు కూత పెడుతుందనే ఆశలపై కాంగ్రెస్ సర్కార్ నీళ్లు జల్లుతూనే ఉంది. నార్త్ సిటీ వాసులకు మెరుగైన రవాణా సదుపాయాలను కల్పించడంలో ప్రతీసారి మొండి చేయి చూపుతూనే ఉంది. అధికారంలోకి వచ్చిన కొత్తలో మేడ్చల్ మార్గంలో ప్రతిష్టాత్మక డబుల్ డెక్కర్ మెట్రో కడతాం అంటూ పై అంతస్తులో మెట్రో, కింద ఫ్లైఓవర్ నిర్మించి ట్రాఫిక్ కష్టాలు తీరుస్తామంటూ కోతలు కోసిన పాలకులు… తీరా క్షేత్రస్థాయికి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. సాంకేతిక కారణాలను బూచీగా చూపుతూ డబుల్ డెక్కర్ నిర్మాణం అసాధ్యమని, ఎలివేటెడ్ కారిడార్‌కు సమాంతరంగానే మెట్రో ఉంటుందని ప్లేటు ఫిరాయిస్తున్నారు.
రహదారి మధ్యలో ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు, దానికి సమాంతరంగా మెట్రో లైన్ వేస్తే భవిష్యత్తులో రహదారి మరింత ఇరుకుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబుల్ డెక్కర్ అయితే ఒకే పిల్లర్‌పై రెండు పనులు జరిగి భూసేకరణ, పరిహార వ్యయం కూడా తగ్గుతుంది. కానీ సర్కారు తీసుకుంటున్న ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల అటు మెట్రో నిర్మాణ వేగం తగ్గిపోవడంతో పాటు ఇటు వాహనదారుల కష్టాలు కూడా రెట్టింపు కానున్నాయి. మొదట మాటలు కోటలు రూపంలో చెప్పి… చివరకు పనులు గడప దాటకముందే ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుగార్చేలా సర్కారు వ్యవహారిస్తోంది. దీనివల్ల నిర్మాణ వ్యయం, భూసేకరణ, విస్తరణ మరింత అసాధ్యంగా మారుతుందని, ప్రాజెక్టు నిర్మాణం కూడా మరింత జాప్యం అవుతుందని, ఇప్పుడున్న ఎలివేటెడ్ ప్రాజెక్టుకు బదులుగా డబుల్ డెక్కర్ ప్రాజెక్టు నిర్మిస్తే అనతి కాలంలోనే రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే వెసులుబాటు దొరుకుతుందనే విషయాన్ని సర్కార్ విస్మరిస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిత్యం లక్షలాది మంది ప్రయాణించే మేడ్చల్ మార్గంలో ట్రాఫిక్ నరకాన్ని తప్పించేందుకు భారీ ఎత్తున డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ నిర్మిస్తామని మొదట్లో చెప్పిన సర్కార్ ప్రజల్లో అంచనాలు పెంచేసింది. తీరా ఇప్పుడు ఆ అంచనాలన్నింటిని తలకిందులు చేస్తూ అసలు డబుల్ డెక్కర్ నిర్మాణమే సాధ్యం కాదంటూ వెనుకడుగు వేస్తున్నారు. భూసేకరణ, ఒకే పిల్లర్‌పై రెండు వేర్వేరు రవాణా వ్యవస్థను డెవలప్ చేయలేమని మెట్రో అధికారులు ఇచ్చిన నివేదికతో సర్కారు కూడా తలూపుతోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం హెచ్ఎండీఏ చేపడుతున్న డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్‌కు సమాంతరంగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమని తీరా రెండున్నరేళ్లు గడిచిన తర్వాత చెబుతోంది. ముందుచూపు లేని ప్రకటనలతో డిజైన్ల మార్పు, సాంకేతిక కారణాలను ముందుకు తెచ్చిన కాంగ్రెస్ సర్కారు మేడ్చల్ వాసులకు మెట్రో ప్రాజెక్టును కలగానే మారుస్తోంది.