మాదాపూర్, డిసెంబర్ 27: ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన ప్రకారం… బోరబండకు చెందిన అకాన్ష్(24), అతడి స్నేహితుడు రఘుబాబు(25) ఓ ప్రైవేట్ కంపెనీలో ఐటీ ఉద్యోగం చేస్తున్నారు.
అయితే ఈనెల 26వ తేదీ రాత్రి 12:30 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై బోరబండ నుంచి మాదాపూర్‌కు వెళ్తుండగా మార్గమధ్యలో పర్వత్‌నగర్ సిగ్నల్ దాటిన తరువాత ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై ఉన్న డివైడర్‌ను ఢీకొట్టగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం మాదాపూర్‌లోని సమీప దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అకాన్ష్ తండ్రి ముల్క కృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.