Hyderabad | హైదరాబాద్ : ఓ వృద్ధుడిపై ఇద్దరు మహిళలు వలపు వల విసిరారు. అతడి ఇంటికి వచ్చి, మాటల్లో పెట్టి రెండు బంగారు గొలుసులను లాక్కొని పారిపోయారు. ఈ ఘటన నాగోల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్‌కు చెందిన పసుపులేటి శిరీష(36), ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఉన్నీసా బేగం అలియాస్ సమీనా(40) బ్యుటీషీయన్లుగా పని చేస్తున్నారు. సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. దీంతో నాగోలు మత్తుగూడ సమీపంలోని తాజా హోటల్లో ఇటీవల ఓ వృద్ధుడిని పరిచయం చేసుకున్నారు. అతని మొబైల్ నంబర్ తీసుకుని తరుచూ మాట్లాడారు.
ఈ క్రమంలో ఆదివారం హోటల్ వద్దకు వచ్చి వృద్ధుడికి ఫోన్ చేశారు. హోటల్ వద్దకు రావాలని కోరారు. ఇంట్లో ఎవరూ లేరని, తానూ రాలేనని చెప్పి, ఇద్దరు మహిళలను ఇంటికి ఆహ్వానించాడు. ఇదే అదునుగా భావించిన వారిద్దరూ ఇంట్లోకి ప్రవేశించి, వృద్ధుడిని మాటల్లో పెట్టారు. అనంతరం అతని మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులను లాక్కొని పారిపోయారు.
దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, ఇద్దరు మహిళలను అరెస్టు చేశారు. బంగారు గొలుసులు స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు. ఉన్నీసాబేగం మరో వ్యక్తితో కలిసి హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇదే రీతిలో ఓ వ్యక్తిని మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.