పీర్జాదిగూడ, జనవరి 28: అర్ధరాత్రి అతి వేగంగా ప్రయాణిస్తున్న కారు జాతీయరహదారిపై అదుపుతప్పి ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టిన దుర్ఘటనలో ఇద్దరు ఇంజినీ రింగ్ విద్యార్థులు అక్కడిక్కడే మృతిచెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లాకు చెందిన నిఖిల్(23) గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుండగా, సాయివరుణ్ (23) ఓయూ డిగ్రీ కళాశాలలో చదువుతూ సద్భావన టౌన్షిప్లో ఉంటున్నాడు. వెంకట్ సీఎంఆర్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు.
రాకేశ్ సీఎంఆర్ కళాశాలలో డ్రాపౌట్ విద్యార్థి. అదేవిధంగా అభినవ్, యశ్వంత్‌రెడ్డి, సాత్విక్, హర్షవర్ధన్ వివిధ కళాశాలల్లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. వీరంతా వనపర్తి పట్టణానికి చెందిన వారే కాక ఒకే పాఠశాలలో విద్యనభ్యసించారు. మౌలాలిలోని వారి స్నేహితుడు అమెరికా నుంచి రావడంతో అతడిని కలవడానికి అందరూ మంగళవారం సాయంత్రం వెళ్లారు. తిరిగి రాత్రి మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారులో పోచారంలో ఉంటున్న స్నేహితుడిని దింపడానికి బోడుప్పల్ నుంచి పోచారం వైపు బయల్దేరారు.
సుమారు రాత్రి 2 గంటల సమయంలో వరంగల్ జాతీయ రహదారిపై మేడిపల్లి వద్దకు రాగానే ముందు వెళ్తున్న రెండు బైక్‌లను తప్పంచడానికి సైడ్ తీసుకుంటుండగా వేగంతో ఉన్న కారు అదుపుతప్పి ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ ైప్లెఓవర్ పిల్లర్ నంబర్ 97ను ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు కాగా కారు నడుపుతున్న నిఖిల్‌తోపాటు సాయివరుణ్ అక్కడిక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న వెంకట్, రాకేశ్‌లకు తీవ్ర గాయాలు కాగా, అభినవ్, యశ్వంత్‌రెడ్డికి స్వల్పగాయాలయ్యాయి.
మరో ఇద్దరు విద్యార్థులైన సాత్విక్, హర్షవర్ధన్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ప్రైవేటు దవాఖానాలకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు.