సుల్తాన్‌బజార్,నవంబర్ 17: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసా చారి కథనం ప్రకారం.. ఎంజీబీఎస్ వెనుక కాలికబర్ ప్రాంతానికి చెందిన రాందాస్ నాయక్వాడే (32) ర్యాపిడో డ్రైవర్. శనివారం రాత్రి 11.30 గంటల సమయంలో మోటార్ సైకిల్‌పై ఇంటి నుంచి బయలు దేరాడు. ఒక కస్టమర్‌ను డ్రాప్ చేసే క్రమంలో కాచిగూడ ఎక్స్‌రోడ్ నుంచి బయలుదేరి.. హెచ్‌పీ పెట్రోల్ పంప్ వద్ద కుత్బీగూడ వైపు వెళ్లేందుకు కుడి మలుపు తిరుగుతుండగా..
కాచిగూడ రైల్వే స్టేషన్ వైపు నుంచి నంబర్ ప్లేట్ లేని యమహా వాహనంపై అతివేగం, నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఓ యువకుడు రాందాస్ వాహనాన్ని ఢీకొట్టాడు. రెండు వాహనాలు ఢీకొనడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. స్థానికులు గమనించి రాందాస్‌ను చికిత్స నిమిత్తం బర్కత్‌పురలోని సీసీ ష్రాఫ్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు పరీక్షించి రాందాస్ మృతి చెందినట్లు తెలిపారు. ఇదిలాఉండగా.. వేగంగా యమహాపై వచ్చిన యువకుడు రాజన్న- సిరిసిల్లా జిల్లాకు చెందిన చంద్రశేఖర్ (20)గా పోలీసులు గుర్తించారు. అతడిని ఉస్మానియా దవాఖానకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడని ఇన్స్పెక్టర్ వివరించారు. ఎస్ఐ నరేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.