Uppal Bhagayath | హైదరాబాద్ : ఉప్పల్ భగాయత్‌లో దారుణం జరిగింది. అక్కడున్న ఓ పిల్లర్ గుంతలో ఇద్దరు పిల్లలు పడి గల్లంతయ్యారు. ఇందులో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొకరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సుజాత – వెంకటేష్ దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వలసొచ్చారు. ఇక ఉప్పల్ – కుర్మానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు దంపతులిద్దరూ వెళ్తున్నారు. అయితే వీరి కుమారులు అర్జున్(8), మణికంఠ(15) నిన్న ఉప్పల్ భగాయత్‌లో కుల సంఘాల భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో పడి గల్లంతయ్యారు.
అర్జున్ ప్రాణాలు కోల్పోగా, మణికంఠ కోసం ఉప్పల్ పోలీసులు, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు. ఈత కోసం వెళ్లారా..? లేదా ఇతరులు ఎవరైనా గుంతలో తోసేశారా..? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బతుకుదెరువు కోసం వచ్చి పిల్లలను పోగొట్టుకున్నామని సుజాత, వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.