మేడ్చల్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరైంది. జిల్లాలోని కుత్బుల్లాపూర్‌లో ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటుకు హైదరాబాద్‌లోని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చర్యలు తీసుకోనున్నారు. వంద ఎంబీబీఎస్ సీట్ల ఇన్‌టేక్ కెపాసిటీతో ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి లభించింది. కళాశాల భవన, రోడ్ల నిర్మాణాలు, పరికరాలు, ఫర్నిచర్ తదితర పనులను వివిధ శాఖలకు అప్పగించారు. జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి ప్రభుత్వం మెడికల్ కాలేజీని మంజూరు చేసింది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తుమ్మలూరులో నిర్వహించిన హరితోత్సవంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విన్నపం మేరకు 15 రోజుల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చారు. 100 మెడికల్ సీట్లతో పాటు జనరల్ దవాఖాన ఏర్పాటుకు కార్యచరణ ప్రారంభిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మెడికల్ కాలేజీని మంజూరు చేసినందుకు జిల్లా ప్రజానీకం తరపున మంత్రి సబితారెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.