బంజారాహిల్స్: దేశాల సరిహద్దులు దాటి నగరానికి వచ్చిన యువతులతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ వ్యభిచార ముఠా గుట్టును జూబ్లీహిల్స్ పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌లోని ఢాకా పట్టణం సమీపంలో నివాసం ఉంటున్న యువతి (23) గత ఏడాది డిసెంబర్లో రకిబ్ అనే ఏజెంట్ సాయంతో పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించింది. కొన్నాళ్ల పాటు తన ఇంట్లోనే ఆమెకు ఆశ్రయం కల్పించిన రకీబ్ ఆమెకు సిమ్ కార్డును సమకూర్చి బెంగళూరుకు పంపించాడు. అక్కడ మోజమ్ అనే వ్యభిచార నిర్వాహకుడి వద్దకు వెళ్లిన యువతిని నెలరోజుల పాటు గదిలో బంధించి వ్యభిచారం చేయించాడు. అక్కడినుంచి తప్పించుకుని బయటపడిన యువతి బెంగళూరులోని కోరమంగళ ప్రాంతో మరో బంగ్లాదేశీయురాలితో కలిసి రెండునెలల పాటు వ్యభిచారం చేసిన తర్వాత అఖిల్ అనే వ్యక్తి ఆమెతో స్నేహం చేసి హైదరాబాద్‌లో (Hyderabad) నాయక్ అనే వ్యభిచార గృహం నిర్వాహకుడి వద్దకు పంపించాడు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 9లోని మింట్ లీవ్ సర్వీస్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్ తీసుకుని గత కొంతకాలంగా వ్యభిచార గృహం నడిపిస్తున్న వ్యవహారంపై సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన యువతితోపాటు థాయ్‌లాండ్‌కు చెందిన మరో యువతి (30)తో పాటు ప్రగతినగర్‌కు చెందిన ఓ ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగి లక్ష్మీనారాయణరెడ్డి (43) అనే విటుడు పట్టుబడ్డాడు. దీంతో లక్ష్మీనారాయణరెడ్డిని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుబడిన విదేశీయువతులను విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. థాయ్‌లాండ్‌కు చెందిన యువతి (30) నెలన్నర క్రితం ట్రావెల్ వీసాతో భారత్‌లో ప్రవేశించినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంకాక్‌లో వెళ్లినప్పుడు పరిచయం అయిన సుజీ అనే బాయ్‌ఫ్రెండ్‌ను కలిసేందుకు చెన్నై వచ్చిన థాయ్ యువతి అతడితో కలిసి వివిద నగరాల్లో తిరిగింది.
డబ్బుల విషయంలో ఇద్దరి మద్యన విభేదాలు రావడంతో అతడినుంచి విడిపోయిన థాయ్ యువతి బ్యాంకాక్‌లో ఉన్న తన స్నేహితురాలు మాయ్ (35) అనే యువతికి ఫోన్ చేసింది. తనకు ఇండియాలో నాయక్ అనే వ్యభిచార గృహం నిర్వాహకుడితో పరిచయం ఉందని, కొన్నాళ్ల పాటు అతడివద్ద ఉండి వ్యభిచారం చేసి డబ్బులు సంపాదించుకుని థాయ్‌లాండ్ తిరిగి రావాలంటూ మోయ్ చెప్పడంతో పాటు కస్టమర్ల వద్దనుంచి తాను డబ్బులు వసూలు చేసి 1000 థాయ్ బాత్‌లు నీ అకౌంట్లో జమచేస్తానని చెప్పింది. దీంతో కొన్నిరోజులుగా జూబ్లీహిల్స్ రోడ్ నెం 9లో నాయక్ అనే వ్యక్తి నడిపిస్తున్న వ్యభిచార గృహంలో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. థాయ్‌లాండ్‌కు వెళ్లి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని బూమ్‌బూమ్ అనే కోడ్ వర్డ్‌తో నగరంలో నాయక్‌తో పాటు థాయ్‌లాండ్, బంగ్లాదేశ్‌కు చెందిన నిర్వాహకులు ఈ సెక్స్‌రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్ డీఐ మధుసూధన్ ఇచ్చిన ఫిర్యాదుతో వ్యభిచార గృహ నిర్వాహకుడు నాయక్, ట్రావెల్ ఏజెంట్ రకీబ్, యువతిని వ్యభిచారంలోకి దింపిన అఖీల్, థాయ్‌లాండ్‌కు చెందిన మాయ్ అనే యువతి, పారెడ్డి లక్ష్మీనారాయణరెడ్డిలపై బీఎన్ఎస్ 143(2), 144(2), బీఎన్ఎస్ 3,4 పిటా యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.