మైలార్దేవ్పల్లి, జూన్ 3 : శిథిలావస్థకు చేరిన గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందగా.. మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ పి.మధులు తెలిపిన వివరాల ప్రకారం… బిహార్ రాష్ర్టానికి చెందిన నిరుపేదలు గత కొంత కాలంగా మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్రెడ్డినగర్లో నివాసముంటూ స్థానికంగా ఉన్న పారిశ్రామికవాడలో కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోశిస్తున్నారు.
మహ్మద్ నజీమ్ కూతురు నూర్ జహాన్ కటూన్(10), మహ్మద్ అలీ(9), నజీమా(6), మహ్మద్ అక్బర్ కుతూరు అఫ్రీయా పర్విన్(5), మహ్మద్ అఫ్జల్ కూతురు అఫ్రీది(3) సోమవారం ఉదయం వారి ఇంటి సమీపంలో ఆడుకుంటున్నారు. అదే ప్రాంతంలో ఉన్న శిథిలావస్థకు చేరిన గోడ ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తడిసిపోయి ఒక్కసారిగా కుప్పకూలి చిన్నారులపై పడింది.
ఈ ప్రమాదంలో నూర్ జహాన్ కటూన్(10), అఫ్రీయా పర్విన్(5) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు చిన్నారులు మహ్మద్ అలీ, నజీమా, అఫ్రీద్లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. కేసు నమోదు చేసిన మైలార్దేవ్పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అబంశుభం ఎరుగరని చిన్నారులు ఆడుకుంటూ మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుకున్న చిన్నారులు తిరిగి రాని లోకానికి వెళ్లిపోవడంతో గుండెలు అవిసేలా రోధించారు. దీంతో బాబుల్రెడ్డినగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.