శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 17: ఐటీ కారిడార్‌లో మహిళా సాఫ్ట్వేర్ ఉద్యోగిని మాటల్లో పెట్టి చేతి బ్రాస్లెట్ దొంగిలించిన ఇద్దరు నిందితులను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను మాదాపూర్ ఏసీపీ సీహెచ్.శ్రీధర్ వెల్లడించారు. కూకట్పల్లి అల్బెస్టర్ కాలనీకి చెందిన లడిపీర్ల రేలాగౌడ్ నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్‌లోని అమెజాన్ కార్యాలయంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు.
ఈనెల 15న మధ్యాహ్నం కార్యాలయం నుంచి బయటకు రాగా, నగరంలోని ఉస్మాన్‌పురకు చెందిన చిక్కుల నరేందర్, కాచిగూడ రాంకోటి ప్రాంతానికి చెందిన అన్నవరం అశిష్కుమార్తో కలిసి అమెజాన్ కార్యాలయానికి హోండా యాక్టీవాపై వచ్చారు. ఐటీ ఉద్యోగిని రేలాగౌడ్ వద్దకు వెళ్లి అమెను మాటల్లో పెట్టి చేతికి ఉన్న బ్రాస్లెట్ను దొంగిలించి ద్విచక్రవాహనంపై ఉడాయించారు.
వెంటనే బాధితురాలు డయల్ 100కు ఫిర్యాదు చేయగా, అక్కడకు చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. సీసీటీవీ పుటేజీ అధారంగా నిందితులు చిక్కుల నరేందర్, అశిష్కుమార్లను బుధవారం అరెస్టు చేశారు. వారివద్ద నుంచి చోరీ సొత్తు 4.80 గ్రాముల బంగారం, రెండు సెల్ఫోన్లు, ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.