మేడ్చల్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసంచేసుకోగా అలియాబాద్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 14 వార్డులలో బీఆర్ఎస్ గెలుపొందింది. ఎల్లంపేట్ మున్సిపాలిటీలో 24 వార్డులకు గాను 12 వార్డులు బీఆర్ఎస్ గెలుపొందింది. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది.మూడు మున్సిపాలిటీలలో 68 వార్డులకు గాను బీఆర్ఎస్ 33, కాంగ్రెస్ 25, బీజేపీ 8, ఇతరులు 2 వార్డుల్లో గెలుపొందారు.
మూడు మున్సిపాలిటీల ఫలితాల్లో ఓటర్లు బీఆర్ఎస్ పక్షాన నిలిచారు. అధికారబలంతో.. పోలింగ్ సమయంలో బీఆర్ఎస్ నేతలపై దాడులకు దిగిన కాంగ్రెస్ పార్టీ చెంప ఛెల్లుమనిపించేలా ఓటర్లు తీర్పునిచ్చారు. మల్కాజిగిరి ఎంపీగా ఈటల ఉన్నప్పటికీ బీజేపీ 8 వార్డులకే పరిమితమైంది.
అలియాబాద్ మున్సిపాలిటీలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. ఇక్కడ బీఆర్ఎస్కు 7, కాంగ్రెస్ 8, బీజేపీ 3, ఇతరులు ఇద్దరు గెలుపొందారు. దీంతో ఇక్కడ ఎక్స్ ఆఫీషియో మెంబర్లు కీలకం కానున్నారు.
మూడు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మార్క్ స్పష్టంగా కనిపించింది. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేలా ప్రణాళిక రూపొందించి సక్సెస్ అయ్యారు. అన్నీతానై 9 రోజుల పాటు మూడు మున్సిపాలిటీలలో పర్యటించి ప్రజల మద్దతును కూడగట్టారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంలో మల్లారెడ్డి సక్సెస్ అయ్యారు.
అలియాబాద్ మున్సిపాలిటీని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ దౌర్జన్యానికి దిగింది. హంగ్‌గా ఏర్పడిన క్రమంలో అధికార బలంతో ఎలాగైనా చైర్మన్ పదవిని పొందాలని గెలుపొందిన బీఎస్పీ పార్టీకి చెందిన వార్డు సభ్యుడు గాదె వెంకటేశ్‌ను కాంగ్రెస్ నేతలు బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా, కొందరు అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య తోపులాటకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటుతున్న సమయంలో పోలీసులు ఇరువురిని చెదరగొట్టి వార్డు సభ్యుడు గాదె వెంకటేశ్‌ను ఎన్నికల కేంద్రంలోకి తీసుకెళ్లి రక్షణ కల్పించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అలియాబాద్‌ను కైవసం చేసుకునేందుకు బీజేపీ వార్డు సభ్యులతో బేరాసారాలు అడుతున్నట్లు తెలుస్తున్నది.