సైఫాబాద్ పరిధిలో జరిగిన భారీ దోపిడీని సెంట్రల్‌జోన్, సీసీఎస్ పోలీసులు ఛేదించారు. ముంబైకి చెందిన దొంగల ముఠా సైఫాబాద్ పరిధిలోని జువెల్లరీ దుకాణంలో దోపిడీకి పాల్పడింది. రూ.కోటిన్నర విలువైన బంగారం, డైమండ్స్ ఎత్తుకెళ్లారు. చందానగర్‌లో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఖజానాజువెల్లర్స్లో షాపు తెరిచిన ఐదు నిముషాలకే లోపలికి చొరబడ్డ దొంగల ముఠా లాకర్ తాళాలు ఇవ్వాలంటూ సిబ్బందిపై కాల్పులు జరిపి అక్కడున్న వెండి సామాగ్రిని దోచుకెళ్లారు.
అదేరోజు కేపీహెచ్ కాలనీలోని ఫేజ్7లో ఎంఐజీలో నివాసముంటున్న రిటైర్డ్ తహసీల్దార్ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఇవన్నీ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషరేట్ల పరిధిలో కేవలం ఒక్కనెలలోపే జరిగిన ప్రధాన నేరాలు. ఇందులో హత్యలు, దారి దోపిడీలు, దోపిడీలు, దొంగతనాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల నేరాలు వెలుగుచూశాయి.
పోలీసుల నిఘా వైఫల్యానికి నిదర్శనంగా నిలుస్తున్న ఈ ఘటనలతో నగరవాసి భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది. నేరం జరిగిన తర్వాత అక్కడికి వెళ్లడం, సీన్ఆఫ్ అఫెన్స్ అంచనా వేయడం, ఆ తర్వాత క్లూస్‌టీమ్, డాగ్ స్కాడ్ ఇలా హంగామా చేసి కొన్ని రోజుల తర్వాత నిందితులను పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెట్టడం .. ఇది ప్రస్తుతం ట్రై కమిషనరేట్ల పరిధిలో పోలీసుల నిత్యకృత్యమైంది. ఎంత పెద్ద కేసైనా దానిని ఛేదించామంటూ చెప్పుకోవడం తప్ప నేరాలు జరగకుండా ముందస్తు నియంత్రణలో దృష్టి పెట్టడం లేదని హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నారు.