సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ) : అసలే ఉక్కపోత, అందులో అర్థరాత్రి పొద్దంతా కష్టపడి ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్ర పోదామనుకునే సమయంలో కరెంట్ కట్. ఇంకేముంది. అప్రకటిత కరెంట్ కోతలతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమయం, సందర్భం లేకుండా అనధికారిక పవర్ కట్‌పై ఉడికిపోతున్నారు. ఇదే విషయాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పంచుకోగా దీనికి స్పందించాల్సిన పవర్ శాఖ అధికారులు కారణాలు చెప్పకుండా నెటిజన్లపై ఎదురుదాడి చేస్తున్నారు. ఒకటో, రెండో సమాధానాలు అంటే పొరపాటే.. @TSSPDCL Corporationను ట్యాగ్ చేసిన ప్రతి ఫిర్యాదుపై ఓ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించి నెటిజన్లపై విరుచుకుపడ్డారు. ఓవైపు అప్రకటిత కోతలు ఏమిటనీ నెటిజన్లు ఫిర్యాదులు చేస్తుంటే సమాధానం చెప్పాల్సిన అధికారి తానొక టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారిగా బయోలో పేర్కొనగా, ఆ హోదాలో ఉండి ట్విట్టర్లో ఎదురుదాడి చేశారు. ప్రస్తుతం ఆయన ఇచ్చిన సమాధానాలు వైరల్ అవుతుంటే.. ఆయన తీరును ప్రశ్నిస్తూ నెటిజన్లు ఏకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకే ఫిర్యాదు చేశారు.
“వర్షం లేదు, కనీసం గాలి దుమారం లేదు. అయినా విద్యుత్ సరఫరా లేదు. నా ఒక్క ఇంటి సమస్య కాదు. కానాజీగూడ శివనగర్‌లోని టెలికాం కాలనీ మొత్తం ఇదే సమస్య. ఇంకేప్పుడు విద్యుత్ సరఫరా మెరుగుపడుతుంది” అంటూ ఓ నెటిజన్ అసహనంతో టీఎస్ఎస్పీడీసీఎల్కు ఫిర్యాదు చేశాడు. దీనికి సమాధానంగా టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి(@sivaji1979) అనే ఎక్స్ హ్యాండిల్ నుంచి స్పందిస్తూ… “ మీరు యూజర్ నంబర్ ఇవ్వకుండా ఫిర్యాదు చేస్తున్నారు అంటే.. మీరు ఫేక్ అకౌంట్ నుంచి ఫిర్యాదు చేస్తున్నట్లుగా లెక్క. మీ మెదడు చెడిపోయి విద్యుత్ లైన్లను డ్యామేజ్ చేస్తున్నాయి. ఒకవేళ మీరు పేషంట్ అయితే దుబాయిలో ఏం జరుగుతుందో… టీవీలో చూడు” అంటూ సమాధానం ఇచ్చారు.
బండ్లగూడ జాగీర్‌కు చెందిన తమ ప్రాంతంలో నెలకొన్న పవర్ కటింగ్ చేశారని ఫిర్యాదు చేయగా… “మీరు సరైన రీతిలో ఫిర్యాదు చేయకుండా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రేష్మా గారు ఫిర్యాదు చేసే ముందు నిజాలు తెలుసుకోండి” అంటూ విరుచుకుపడ్డారు.
ఇక తమ ప్రాంతంలో నెలకొన్న కరెంటు సమస్యలపై కార్తీక్ రెడ్డి ఫిర్యాదు చేయగా.. దీనికి సమాధానంగా మీరు ఏ పార్టీ కోసం పనిచేస్తున్నారో మాకు అనవసరం. కానీ ఆకాశం మీద ఉమ్మి వేసే ముందు ఒకసారి ఆలోచన చేయండి. మీ తీరు మొత్తం రాజకీయ ఉద్దేశంతోనే ఉంది. ఇదంతా చూస్తుంటే మీరు బీఆర్ఎస్ కోసం పనిస్తున్నారు అనుకుంటా.” అంటూ వ్యాఖ్యానించారు. అయితే జవాబుదారీతనానికి నిదర్శనంగా ఉండాల్సిన టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారి చేసిన ట్వీట్లపై నెటిజన్లు కూడా అదే స్థాయిలో స్పందించారు. ఏకంగా స్థానికంగా ఎదుర్కొంటున్న అప్రకటిత కరెంట్ కోతలపై ఫిర్యాదు చేసినందుకు.. పొలిటికల్ చేస్తున్నారని భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్లే అవుతుందని, ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటున్న @sivaji1979పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.