సిటీబ్యూరో, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : నగరంలో కొత్త బస్సుల కొనుగోలు కోసం చర్యలు మొదలు పెట్టిన ఆర్టీసీ యాజమాన్యం అనేక మార్గాలను అన్వేషిస్తున్నది. నిధులను సమకూర్చుకోవడం కోసం ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న స్థలాలను లీజుకు ఇవ్వనున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ కార్యాలయాల పరిధిలోని అన్ని రకాల బస్టాండ్లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్ రీజనల్ పరిధిలో ఉన్న జేబీఎస్, సికింద్రాబాద్ బస్టాండ్లలో స్థలాలు, స్టాళ్లు, షాపులను లీజుకు ఇచ్చేందుకు ఆర్టీసీ యాజమాన్యం వేరువేరుగా టెండర్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. అదేవిధంగా ఎంజీబీఎస్, కోఠి బస్టాండ్లలో కూడా టెండర్లు పిలిచారు. ఇందులో ముఖ్యంగా ఆర్టీసీ గ్రేటర్ పరిధిలోని అన్ని రకాల షాపులు, హోటళ్లు, ఫుడ్స్టాళ్లు, పార్కింగ్, లాజిస్టిక్స్ (కార్గో పార్సిల్ సేవలు), డార్మిటరీ వంటి బహుళ రూపంలో ఉన్న స్థలాల కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. గ్రేటర్ జోన్ పరిధిలో దాదాపు 25వేల స్వేర్ ఫీట్స్ స్థలాన్ని లీజుకు ఇవ్వనున్నట్లు టెండర్లలో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఆర్టీసీ గ్రేటర్ జోన్ పరిధిలో కొనసాగుతున్న వ్యాపార సముదాయాల స్థలాలకు ఇంకా లీజు గడువు ముగియలేదు. అయినప్పటికీ అదనపు బస్సుల కొనుగోలు, మహాలక్ష్మి పథకం కొనసాగింపు నేపథ్యంలో ముందుగానే ఆర్టీసీ యాజమాన్యం వ్యాపార సముదాయాల లీజు కోసం టెండర్లు పిలిచి, జనవరి 8, 9 తేదీలలో గడువు విధించింది. బస్టాండ్లు, ఎక్కువ స్థలాల కోసం ఇ-టెండర్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని, మిగిలిన స్టాళ్ల కోసం మ్యాన్యువల్ విధానంలో టెండర్లు దాఖలు చేయడానికి అవకాశం కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న షాఫులపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని లీజుకు తీసుకున్న యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.